ఆంధ్రప్రదేశ్ సహా అన్ని రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు వైసీపీ నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణ రాజు లేఖ రాశారు. త్వరలో జరగనున్న గవర్నర్ల సదస్సులో సెక్షన్ 124ఏ రాజద్రోహం కేసును పూర్తిగా రద్దు చేసే విషయంపై సదస్సులో చర్చించాలని రఘురామ గవర్నర్లును కోరారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, సంక్షేమ కార్యక్రమాలల్లో లోపాలు ఎత్తి చూపినందుకు తనపై సీఎం జగన్ అక్రమ కేసులు పెట్టి వేధించిన విషయాన్ని గవర్నర్ల దృష్టికి రఘురామ తీసుకెళ్లారు. ప్రజా సమస్యలు ప్రభుత్వానికి అర్థం అయ్యేలా చేస్తే… సీఎం జగన్ వ్యక్తిగత కక్ష పెంచుకుని అక్రమ కేసులు బనాయించేలా చేశారని రఘురామ లేఖలో పేర్కొన్నారు.
ఏపీ సీబీసీఐడి పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి.. అక్రమంగా తనని అరెస్టు చేసి హైదరాబాద్ నుంచి గుంటూరుకు తరలించారని లేఖలో పేర్కొన్నారు. అరెస్టు చేసిన రోజే.. సీఐడి కార్యాలయంలో అత్యంత క్రూరంగా హింసించారని.. సీఐడి ఏడీజీ సునీల్ కుమార్ నేతృత్వంలో ఐదుగురు వ్యక్తులు లాఠీలు, రబ్బరు బెల్టులతో తనను చిత్రహింసలకు గురి చేశారని రఘురామ గవర్నర్ల దృష్టికి తీసుకువచ్చారు. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా ఒక సిట్టింగ్ ఎంపీపై దేశద్రోహం నేరం మోపడమే కాకా.. హింసించడం ఇదే తొలిసారని లేఖలో రఘురామ వివరించారు. ఈ విషయాన్ని ఇప్పటికే రాష్ట్రపతి దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు రఘురామ పేర్కొన్నారు. రాష్ట్రపతి అధ్యక్షతన జరిగే సదస్సులో ఈ అంశాన్ని లెవనెత్తి.. తనకు మద్దతుగా నిలవాలని అన్ని రాష్ట్రాల గవర్నర్లకు రఘురామ విజ్ఞప్తి చేశారు. కాగా, నిన్న ఏపీ సీఎం జగన్ మినహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రఘురామ లేఖలు రాసిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: జగన్ మినహా అన్ని రాష్ట్రాల సీఎంలకు ఎంపీ రఘురామ లేఖ!