కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్రలో విషాదం చోటుచేసుకున్నది. ఈరోజు లుథియానాలో ఉదయం ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో కాంగ్రెస్ ఎంపీ సంతోక్ సింగ్‌కు గుండెపోటు వచ్చింది. అయితే ఆయన్ను అంబులెన్స్‌లో హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. ఎంపీ సంతోక్ ర్యాలీలోనే తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది. ఎంపీ సంతోక్ మృతి చెందినట్లు ఆ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ సింగ్ తన ట్విట్టర్లో తెలిపారు. ఫిల్లౌర్‌లో వాకింగ్ చేస్తున్న సమయంలో ఎంపీ సంతోక్ నీరస పడిపోయారు. దీంతో ఆయన్ను పగ్వారాలోని హాస్పిటల్‌కు తరలించారు.
కాంగ్రెస్ నేతలు రాణా గుర్జీత్ సింగ్, విజయ్ ఇందర్ సింగ్లాలు ఎంపీ మృతిని ద్రువీకరించారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ యాత్రను నిలిపివేశారు. 1946 జూన్ 18న జలంధర్‌లోని ధలివాల్ ప్రాంతంలో సంతోక్ సింగ్ జన్మించారు. పంజాబ్‌లో కాంగ్రెస్ హయాంలో కేబినెట్ మంత్రిగా పనిచేశారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో జలంధర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి వరుసగా రెండు సార్లు విజయం సాధించారు.