Monday, November 18, 2024

టాలీవుడ్‌కు షాక్.. రేపటి నుంచి తెలంగాణలో థియేటర్లు బంద్

కరోనా వైరస్ ప్రభావం మరోసారి సినిమా ఇండస్ట్రీపై పడింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో బుధవారం నుంచి సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులు మూతపడనున్నాయి. ఈ మేరకు సినిమా థియేటర్ల ఓనర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. ప్రేక్షకుల ఆరోగ్యం దృష్ట్యా బుధవారం నుంచి సినిమా ప్రదర్శనలను స్వచ్ఛందంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే తెలంగాణలో నైట్ కర్ఫ్యూ ప్రకటించిన కారణంగా తొలుత రాత్రి 7:30 గంటల వరకు సినిమా ప్రదర్శనలు నిర్వహిస్తారని ప్రచారం జరిగింది. అయితే ప్రభుత్వ నిబంధనల కారణంగా సినిమా ప్రదర్శనలను పూర్తిగా నిలిపివేయాలని థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణ ప్రభుత్వం విధించిన కరోనా నిబంధనల ప్రకారం థియేటర్లను రాత్రి 8 గంటల కల్లా క్లోజ్ చేయాలి. ఇలా చేయాలంటే థియేటర్లలో రెండు షోలు మాత్రమే వేసుకునే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే కరోనా వైరస్ వల్ల థియేటర్లలో ఆక్యుపెన్సీ భారీగా పడిపోయింది. కొన్ని థియేటర్లలో మినిమం కలెక్షన్లు కూడా రావడం లేదు. రెండు షోల వల్ల ఒరిగేదేమీ లేదని అసోసియేషన్ అభిప్రాయపడింది. అటు పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’చిత్రం మాత్రం ఓ మోస్తరు కలెక్షన్‌లను రాబడుతోంది. దీంతో ఈ సినిమా ప్రదర్శించే థియేటర్లకు మాత్రం థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ మినహాయింపు ఇచ్చింది. కాగా ఇటీవలే కేంద్రం 100 శాతం ఆక్యుపెన్సీతో సినిమా ప్రదర్శనలకు అనుమతి నిచ్చింది. కొన్ని సినిమాలు మంచి విజయం సాధించడంతో పరిశ్రమ కోలుకుంటుందని భావిస్తున్న తరుణంలో మరోసారి కరోనా వైరస్ పంజా విసురుతూ టాలీవుడ్‌కు శాపంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement