సినామా అంటే వినోదం.. సినిమా అంటే సంబురం.. సినిమా అంటే సమాచార మాధ్యమం.. అవును.. చాలా సినిమాలు సమాజానికి ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తాయి. ప్రజల మనస్సులో ఎప్పుడూ గుర్తుండిపోతాయి. అందులో సామాన్యుల జీవన విధానం.. కష్టాలు, కన్నీళ్లు వంటివి మరీ మనస్సులను హత్తుకుంటాయి. అందుకేనేమో జై భీమ్ మూవీ అంటే జనాలు దీపావళి పండుగలా సంబురపడుతున్నారు. ఆ సినిమా చూసిన వాళ్లంతా సినిమా అంటే ఇట్లా ఉండాలే అని తమ మనోభావాలను హ్యాపీగా వెల్లడి చేస్తున్నారు. నిజ జీవితంలో జరిగిన ఇన్సిడెంట్స్‌ని ఉన్నదున్నట్టు.. ప్రజలకు అర్థమయ్యే రీతిలో సినిమాగా అందించిన నిర్మాతలు సూర్య, జ్యోతికలను పొగుడుతున్నారు. ఆ మూవీ డైరెక్టర్‌ను ఆకాశానికెత్తుతున్నారు.. నిజ జీవితంలో అణగారిన వర్గాల పక్షాన నిలిచిన అడ్వకేట్ చంద్రుని నేటి తరానికి పరిచయం చేయడం.. అంతటి గొప్ప భావజాలమున్న వ్యక్తిత్వాన్ని నేటి తరం లాయర్లకి ఓ గైడ్‌గా చూపించడం హర్షించదగ్గ విషయం.
ఈ మధ్య ఓటీటీలో రిలీస్ అయ్యి.. సూపర్ డూపర్ హిట్ అయిన జైభీమ్ మూవీ గురించి గుడ్ రెస్పాన్స్ వస్తోంది.. ఎటువంటి పాటలు, ఫైట్లు, వెగటుపుట్టించే బొడ్డు సీన్లు.. అశ్లీలపు మాటలు.. చేష్టలు లేని జై భీమ్ మూవీపై పాజిటివ్ రెస్పాన్స్‌తో సోషల్ మీడియా మోతెక్కిపోతోంది.. అడ్వొకేట్ చంద్రు పాత్రలో ఒదిగిపోయారు సినీ హీరో సూర్య. ఈ మధ్యకాలంలో తాను ఎంచుకుంటున్న మూవీస్ చాలా డిఫరెంట్‌గా ఉంటున్నాయి.. హ్యాట్సాఫ్ అంటోంది మూవీ చూసిన ప్రజానీకం.. అయితే ఈ మూవీపై చాలా కామెంట్స్ వస్తున్నాయి. అన్నీ పాజిటివ్ గానే ఉంటున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాటిలో మచ్చుకు ఇదొకటి.. ఓ ఫేస్ బుక్ వాల్ నుంచి తీసుకొచ్చి.. పాఠకులకు ముందుచుతున్నాం.. చదవండి. సినిమా చూసీ మీరూ జైభీమ్ అనండి..
‘‘ఏ మూలనో నక్కి నీలుగుతున్న కాస్తంత మనిషితనాన్ని మళ్లీ తట్టి లేపావు కదయ్యా. ఎంత బాధ ఎంత బాధ కడుపులో నుంచి పాక్కుంటా గుండెను మెలిపెట్టింది కదయ్యా. కష్టపడే శక్తిన్నోళ్లకి దొంగతనం చెయ్యాల్సిన పని లేదని సినతల్లి ఎంత బాగా చెప్పింది. మట్టి గోడల మధ్య మట్టి మనుషుల మధ్య ప్రేమలు చిగురిస్తాయే కానీ, అసూయలు ద్వేషాలు, పడగొట్టడాలు, కోట్లకు పడగలెత్తటాలు లాంటి పనికిమాలిన వ్యూహాలకు తావెక్కడిది. ఏం నటించావు తల్లీ కళ్లు కన్నీటి ఊపిరందక ఉక్కిరిబిక్కిరయ్యాయి. మనసంతా ఏదో తెలియని బరువు.
నా దగ్గర ఏమీ లేకపోయినా డబ్బు సానా ఉంటది. రేపటి రోజున నా బిడ్డలు మనం ఎలా బతుకుతున్నామని నన్ను అడిగితే మీ నాన్నను కొట్టి సంపినోళ్లు ఇచ్చిన డబ్బుతో బతికేత్తన్నామని సెప్పనా ..ఈ ఒక్కమాట చాలు అవినీతి ముఖం మీద ఖాండ్రించి ఊసినట్టుగా లేదూ.
దొంగతనాలు దొమ్మీలకు ఒక జాతి ఉంటుందని ఎప్పటికప్పుడు తమ లేకీ బుద్ధి చూపించుకుంటూనే ఉంటుంది. ఈ నాగరీక వ్యవస్థ. కొట్టి సంపేసినా తప్పు చెయ్యలేదనే మాట తప్ప నోటెంట ఒక్క మాట రాలేదు చూడూ అతను మనిషంటే. అది గుండె అంటే.
పుట్టుకతోనే నేను వకీల్ ని కాదమ్మ ఈ మాట గుండెల మీద చెయ్యి వేసుకుని ఇప్పటి వకీళ్లు అనగలుగుతారా? అందుకే పీడితుల పక్షాన అలుపెరుగని పోరాటం చేశాడు. లాయర్ చంద్రు గారికి లాల్ సలాములు..
ఇలాంటి సినిమాలు ఇంకా ఇంకా తియ్యండి సాములూ
ఒక్క రొమాంటిక్ సీన్ లేదు. ఎక్కడా పనికిమాలిన కామెడీ లేదు. కదలకుండా చూశాము. మా అబ్బాయి మళ్లీ ఒక్కడే చూసాడు.
ఎవడన్నాడు బూతు పాట లేనిదే సినిమా ఆడదని.. ఎవడన్నాడు బూతు కామెడీ లేనిదే సినిమా జనాలకు ఎక్కదని.. ఎవడన్నాడు రొమాంటిక్ సీన్ లు ఫైట్ లు లేనిదే సినిమా ఆడదని.. అసమానతలు, అణచివేతలు, వివక్షలు, అవహేళనలు, అంతుపట్టని ఆవేదనలు ఆక్రందనలూ మన చుట్టూ తిరుగుతున్నంతకాలం ఇలాంటి సినిమాలు సజీవంగా ఉంటాయి. ఇలాంటి పాత్రలూ సజీవంగానే ఉంటాయి. చాలా రాయాలనుంది కానీ మనసంతా ఇంకా పాత్రల్లోనే కొట్టుకుపోతా ఉంది.’’
జై భీమ్!