ఒక హిందువుగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు పాదాభివందనం చేస్తున్నానని సినీనటుడు సుమన్ అన్నారు. ఆయనను ఏదైనా అనేముందు ఒక్కసారి ఆలోచించుకోవాలని చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ హిందువులనే కాకుండా అన్ని మతాల వారిని గొప్పగా ఆదుకొంటున్నారని, ఇలాంటి నాయకుడు రాష్ట్ర ప్రజలకు దొరకడం అదృష్టమని పేర్కొన్నారు. ‘సీఎం కేసీఆర్ గురించి చెప్పాలి.. మన హిందువులకు ఆయన ఇచ్చిన బహుమతి యాదాద్రి ఆలయం. దాన్ని చూసి తరతరాలు గర్వపడుతాయి. ఎంత డబ్బైనా సరే ఖర్చు పెట్టి ఆలయాన్ని దేశంలోనే ది బెస్ట్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఆయనది గొప్ప మనసు. ఒక హిందువుగా కేసీఆర్‌కు పాదాభివందనం చేస్తున్నా. హిందువుల పేరును ఆయన నిలబెట్టారు. లక్ష్మీనృసింహస్వామే ఆయనను సీఎం చేశారేమో. తెలంగాణ ప్రజలు తలెత్తుకొని బతుకుతున్నారంటే అది కేసీఆర్ వల్లే. రాజకీయంలో తప్పొప్పులుంటాయి. కానీ, అంతకుముందు ఏం లేవు.. ఇప్పుడు ఏం ఉన్నాయి.. ఏం రావాలి? అన్నది ఆలోచించాలి. అంతేకానీ, ప్రతిసారి ఆయనను విమర్శించటం తగదు. అది బాధాకరం. కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని నడిపించారు. ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, ఇతరులు ఇలా చాలా మంది పాల్గొన్నారు.
కేసీఆర్ వల్లే తెలంగాణ ప్రజలంతా తలెత్తుకొని బతుకుతున్నారు’ అని సుమన్ వ్యాఖ్యానించారు. యాదాద్రికి మన రాష్ట్రం నుంచే కాకుండా, తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా భక్తులు వస్తారని, లక్ష్మీనృసింహుడంటే భక్తులకు ఎంతో నమ్మకమని అన్నారు. మనస్ఫూర్తిగా, శుద్ధ మనుసుతో నారసింహుడిని పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పారు. 1989లో మద్రాస్ నుంచి తెలుగు చిత్ర పరిశ్రమ వస్తుందని చెప్పగా మొదటిసారిగా తెలంగాణకు వచ్చానని అన్నారు. తెలంగాణకు, హైదరాబాద్‌కు వెళ్లొద్దని, అక్కడ రౌడీయిజం, గూండాయిజం ఉంటుందని భయపెట్టారని చెప్పారు. కానీ, తెలంగాణ ప్రజలు సొంత అన్నలా, తమ్ముడిలా ఆదరించారని తెలిపారు. వారు చూపిన అభిమానంతోనే ఉద్యమంలో తన వంతుగా పాల్గొన్నానని వివరించారు. ఏ కార్యక్రమానికి వెళ్లినా జై తెలంగాణ.. జైజై తెలంగాణ.. జై కేసీఆర్ అంటూ నినందించానని వెల్లడించారు. ఇప్పుడు ఎంతోమంది ఉద్యమ నాయకులు మంచి స్థాయిలో ఉన్నారని, రానున్న రోజుల్లో మరింతమంది మంచి స్థాయికి వస్తారని, అందుకు కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..