Tuesday, November 26, 2024

Movie Review : విమానం ఎలా ఉందంటే..

స‌ముద్ర‌ఖ‌ని ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన చిత్రం విమానం..ఈ చిత్రంలో అవిటివాడైన తండ్రి పాత్ర‌లో న‌టించారు సముద్ర‌ఖ‌ని.ఈ మూవీ నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి ఈ చిత్రం ఎలా ఉందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం..

క‌థ ఏంటంటే.. వీర‌య్య(స‌ముద్ర ఖ‌ని) అవిటివాడు. భార్య చ‌నిపోవ‌టంతో అన్నీ తానై కొడుకు రాజు (మాస్ట‌ర్ ధ్రువ‌న్‌)ను పెంచి పెద్ద చేస్తుంటాడు. రాజు కూడా చ‌క్క‌గా చ‌దువుకుంటుంటాడు. అయితే త‌న‌కు విమానం అంటే తెలియ‌ని ప్రేమ. విమానం ఎక్కాల‌ని క‌ల‌లు కంటుంటాడు. బాగా చ‌ద‌వుకుంటే విమానం ఎక్క‌వ‌చ్చున‌ని వీర‌య్య కూడా కొడుక్కి చెబుతుంటాడు. బ‌స్తీలో ఉండే వీర‌య్య‌కు తాత తండ్రుల నుంచి వ‌చ్చిన సుల‌భ్ కాంప్లెక్స్ మాత్ర‌మే జీవ‌నాధారం. రాజు కోరుకొండ సైనిక స్కూల్‌కి ఎంపిక అవుతాడు. ఇక త‌న కొడుకు భ‌విష్య‌త్తు మారిపోతుంద‌ని వీర‌య్య ఆనంద‌ప‌డిపోతాడు. అంత‌లో హ‌ఠాత్తుగా అనుకోని నిజం తెలిసి వీర‌య్య కుప్ప‌కూలిపోతాడు. ఎలాగైనా కొడుకుని విమానం ఎక్కించాల‌ని తాప‌త్ర‌య‌ప‌డ‌తాడు. కొడుకు కోరిక‌ను నేర‌వేర్చ‌టానికి ఎన్నో ఇబ్బందులు ప‌డ‌తాడు. అస‌లు ఇంత‌కీ వీర‌య్య‌కి తెలిసిన నిజం ఏంటి? మూడు పూట‌ల స‌రైన తిండి తిన‌టానికే ఇబ్బంది ప‌డే వీరయ్య ఉన్న‌ట్లుండి త‌న కొడుకుని ఎందుకు విమానం ఎక్కించాల‌నుకుంటాడు? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

- Advertisement -

విశ్లేష‌ణ.. పేద‌వాడైన తండ్రి త‌న కొడుకుని ప్ర‌యోజ‌కుడుగా చూడాల‌ని క‌ల‌లు కంటాడు. ఆ ప్ర‌యాణంలో ఎన్నో ఇబ్బందులు ప‌డ‌తాడు. అలాంటి తండ్రి పాత్ర‌లో స‌ముద్ర ఖ‌ని అద్భుతంగా న‌టించారు. అది కూడా అవిటిత‌నం ఉన్న వ్య‌క్తిగా. కొడుకు తాహ‌తుకి మించిన కోరిక‌ను అడుగుతున్నాడ‌ని తెలిసినా అత‌న్ని ఏమాత్రం తిట్ట‌డు. బాగా చ‌దువుకోవాల‌ని ఎంక‌రేజ్ చేసే పాత్ర‌ధారిగా ఒక వైపు.. ఎంతో ప్రేమ‌గా పెంచుకుంటున్న కొడుక్కి స‌మ‌స్య ఉంద‌ని తెలియ‌గానే త‌ల్ల‌డిల్లిపోయే తండ్రిగా మ‌రో వైపు అద్భుత‌మైన న‌ట‌న‌ను క‌న‌ప‌రిచాడు. ఇక మాస్ట‌ర్ ధ్రువ‌న్ కూడా అంతే అద్భుతంగా న‌టించాడు. ఇద్ద‌రి మ‌ధ్య బాండింగ్‌, కొడుకు కోసం తండ్రి ప‌డే ఇబ్బందులు, అలాగే తండ్రి త‌న కోసం బాధ‌ప‌డుతున్నాడ‌ని కొడుకు త‌న కోరిక వ‌దులుకోవాల‌నుకోవ‌టం ఇవ‌న్నీ ఎమోష‌న‌ల్‌గా ఆడియెన్స్‌కి క‌నెక్ట్ అవుతాయి. బుల్లి తెర‌పై స్టార్ యాంక‌ర్‌గా రాణించిన అన‌సూయ ఇప్పుడు సిల్వ‌ర్ స్క్రీన్‌పై విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల‌తో మెప్పిస్తోంది. ఈ సినిమాలో ఆమె చేసిన సుమ‌తి అనే వేశ్య పాత్ర కూడా ఆమెకు మంచి గుర్తింపునే తెచ్చిపెడుతుంది. అలాగే సుమ‌తిని ప్రేమించే కోటి పాత్ర‌లో రాహుల్ రామ‌కృష్ణ కూడా ఒదిగిపోయాడు. ఇక ఆటోడ్రైవ‌ర్ డేనియ‌ల్‌గా ధ‌న‌రాజ్ కూడా త‌న రోల్‌కు న్యాయం చేశారు. త‌మిళ నటుడు రాజేంద్ర‌న్ కాసేపే క‌నిపించారు కానీ.. ఆ పాత్ర‌కు అంత పెద్ద ప్రాధాన్య‌త ఉండ‌దు. అలాగే న‌టి మీరా జాస్మిన్ ఇందులో అతిథి పాత్ర‌లో న‌టించారు. ఆమె ఇది వ‌ర‌కటిలా బొద్దుగా కాకుండా స్లిమ్‌గా క‌నిపించటం విశేషం.

టెక్నిక‌ల్స్.. ద‌ర్శ‌కుడు శివ ప్ర‌సాద్ పాత్ర‌ల‌ను ప‌రిచ‌యం చేయ‌టానికే ఎక్కువ స‌మ‌యం తీసుకున్నారు. వీర‌య్య‌, అత‌ని కొడుకు పాత్ర‌లే ప్ర‌ధానం. వాటి మ‌ధ్య ఎమోష‌న‌ల్ పాయింట్ ఆడియెన్స్‌కు బాగా క‌నెక్టింగ్‌. మిగిలిన పాత్ర‌లు బాగానే ఉన్నా అంత ఎఫెక్టివ్‌గా అనిపించ‌వు. చ‌ర‌ణ్ అర్జున్ సంగీతం, లిరిక్స్ చాలా బావున్నాయి. నేప‌థ్య సంగీతం చాల బావుంది. తండ్రీ కొడుకుల మ‌ధ్య ఉన్న ఎమోష‌న్‌ను ఆడియెన్స్‌కి క‌నెక్ట్ చేయించ‌టంలో ఎంతో కీల‌క భూమిక‌ను పోషించింది. వివేక్ కాలేపు సినిమాటోగ్ర‌ఫీ బావుంది.మొత్తానికి ఎమోష‌న‌ల్..డ్రామా చిత్రంగా ఆక‌ట్టుకుంటోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement