సినీ పరిశ్రమకి సంబంధించి అన్ని సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని తెలిపారు మంత్రి పేర్ని నాని. నేడు ఏపీ సీఎం జగన్ తో సినీ ప్రముఖులు భేటీ అయిన సంగతి తెలిసిందే. జగన్ తో చిరంజీవి, మహేశ్ బాబు, ప్రభాస్, ఆర్. నారాయణమూర్తి, రాజమౌళి, కొరటాల శివ తదితరులు భేటీ అయ్యారు. సమావేశానంతం మీడియాతో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ..సినీ పరిశ్రమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకురావడానికి చిరంజీవి ఎంతో కృషి చేశారని తెలిపారు. ప్రభుత్వం తరపున ఆయనను అభినందిస్తున్నామని చెప్పారు. ఒక రిలీఫ్ తీసుకొచ్చేందుకు చిరంజీవి కృషి చేశారని చెప్పారు. ఏపీలో కూడా షూటింగులు జరపాలని సినీ ప్రముఖులను జగన్ కోరారని పేర్ని నాని చెప్పారు.
విశాఖలో పెద్ద ఎత్తున షూటింగులు జరిగేలా చూడాలని… అవసరమైతే ప్రభుత్వం తరపున ఎలాంటి సహాయం చేసేందుకైనా సిద్ధమని చెప్పారని వెల్లడించారు. ఈ సందర్భంగా తమకు హైదరాబాద్ ఎంతో ఏపీ కూడా అంతేనని సినీ ప్రముఖులు చెప్పారని… వారికి ధన్యవాదాలు చెపుతున్నామని అన్నారు. చిన్న సినిమాల గురించి ఆర్. నారాయణమూర్తి ఆయన ఆవేదనను సీఎంకు తెలియజేశారని పేర్ని నాని చెప్పారు. చిన్న సినిమాల విషయంలో తామంతా కలిసి మాట్లాడుకుంటామని సినీ ప్రముఖులు చెప్పారని వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..