తెలంగాణలో మూడు జూట్ మిల్లులను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. వరంగల్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో జూట్ పరిశ్రమల ఏర్పాటు చేసేందుకు కొన్ని కంపెనీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఈ ఉత్పత్తులను 20 ఏళ్ల వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో జూట్ పరిశ్రమలకు సంబంధించిన పంటను రాష్ట్రంలోనే పండించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఐదేళ్ల పాటు జూట్ పరిశ్రమలకు రవాణా రాయితీలు అందజేస్తామని చెప్పారు. జూట్ మిల్లుల ఏర్పాటుతో 10 వేలకుపైగా మందికి ఉపాధి లభిస్తుందన్నారు.
వ్యవసాయ రంగంలో దేశానికే తెలంగాణ ఆదర్శమని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు భారీగా పెరుగుతున్నాయన్న ఆయన.. సీఎం కేసీఆర్ విజన్‌తో వ్యవసాయ దిగుబడులు ఐదింతలు పెరిగాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి, వ్యవసాయానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు దృష్టిపెట్టాలని సూచించారు. నూతనంగా నెలకొల్పబోయే ఈ జూట్ పరిశ్రమల ద్వారా.. ఖరీఫ్, రబీ కాలాల్లో రాష్ట్రానికి అవసరమయ్యే గన్నీ బ్యాగుల కొరత తీరనుందని చెప్పారు. వరంగల్, సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లోనే కాకుండా.. నల్గొండ, మహబూబ్‌నగర్ వంటి ఇతర జిల్లాల్లోనూ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తమ ప్రతిపాదనలతో ఔత్సాహికులు ముందుకొస్తే తప్పకుండా జూట్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. జూట్ ఉత్పత్తులతో ప్లాస్టిక్ మహమ్మారిని కూడా తరిమికొట్టొచ్చు అని అభిప్రాయపడ్డారు. జూట్ ఉత్పత్తులతో పర్యావరణానికి మేలు జరుగుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పదివేల ఎకరాల్లో స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. భవిష్యత్‌లో జూట్ పరిశ్రమకు రాష్ట్రంలో మంచి డిమాండ్ ఉంటుందని చెప్పారు.
ఇది కూడా చదవండి: తెలంగాణ మంత్రిమండలిలో కీలక నిర్ణయాలు.. కేబినెట్ సబ్ కమిటీలో వారికి చోటు!