ఆటోమొబైల్ సంస్థ ఎంజీ మోటార్స్ ఇండియా (Morris Garages Motors India).. మరో విద్యుత్ కార్‌ను (ఈవీ) విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈసారి బడ్జెట్ ధరలో కొత్త ఎలక్ట్రిక్ కారును తీసుకురావాలని ఎంజీ మోటార్స్ భావిస్తోందని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. నూతన ఎలక్ట్రిక్ కారు ధర రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల మధ్య (MG Budget Electrice car) ఉండవచ్చు. ఈ విషయాన్ని కంపెనీ స్వయంగా ప్రకటించడం గమనార్హం.
ప్రస్తుతం ఈ కంపెనీ గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకుని కొత్త కార్లను రిలీజ్ చేస్తోంది. భారత మార్కెట్‌కు, దేశీయ వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టు వాటిల్లో మార్పులు చేసి.. కొత్త మోడల్స్‌ని రిలీజ్ చేస్తోంది. ఇప్పటికే కొత్త మోడల్ కోసం ప్రక్రియ ప్రారంభమైనట్లు కంపెనీ తెలిపింది.
దేశీయ మార్కెట్లోకి ఎస్యూవీ అస్టోర్తో మంచి సేల్స్‌ను సాధించింది ఎంజీ మోటార్స్. దీంతో జోరుమీదున్న ఈ కంపెనీ.. ప్రస్తుతం ఈవీలపై దృష్టిసారిస్తున్నట్లు తెలిపింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సహకం (పీఎల్ఐ) పథకం ద్వారా ప్రభుత్వ ప్రోత్సాహం కూడా లభిస్తున్న నేపథ్యంలో ఈవీలే ప్రధాన వృద్ధి మార్గంగా భావిస్తున్నట్లు వివరించింది. కొత్త ఈవీ వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి విడుదల చేసే అవకాశమున్నట్లు వివరించింది.
ఆ కార్లకు పోటీగా..
దేశంలో దిగ్గజ వాహన తయారీ కంపెనీలుగా ఉన్న టాటా విద్యుత్ వాహనాలకు పోటీ ఇచ్చేందుకు ఎంజీ మోటార్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే బడ్జెట్ ధరలో కొత్త కారును తీసుకురానుందని సమాచారం. ముఖ్యంగా టాటా నెక్సాన్, టిగోర్ ఈవీలకు ఎంజీ మోటార్స్ మోడల్స్ గట్టి పోటీ ఇచ్చే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రస్తుతం ఎంజీ ఎలక్ట్రిక్ కారు ధర ఎంతంటే..
ఎంజీ మోటార్స్ ప్రస్తుతం ఎస్యూవీ ‘ZS EV’ ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లో విక్రయిస్తోంది. ఇది రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని ధరను (ZS EV price) రూ.21 లక్షల నుంచి రూ.24.68 లక్షల మధ్య (ఎక్స్ షోరూం) ఉంది.