Friday, November 22, 2024

ఆధార్‌పై ఉద‌యం ఆదేశాలు.. మ‌ధ్యాహ్నం ఉప‌సంహ‌రించుకున్న‌ట్టు ప్ర‌క‌టించిన కేంద్రం

ఆధార్ కార్డుల జిరాక్స్ కాపీల‌ను ఇత‌రుల‌కు స‌మ‌ర్పించేట‌ప్పుడు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని, మాస్క్ వేసిన ఆధార్ కార్డుల‌ను ఇవ్వాల‌ని జారీ చేసిన ప్ర‌క‌ట‌న‌ను కొన్ని గంట‌లు గ‌డ‌వ‌కముందే కేంద్ర ప్ర‌భుత్వం ఉప‌సంహ‌రించుకుంది. ఈ మేర‌కు ఇవ్వాల (ఆదివారం) ఉద‌యం జారీచేసిన ఈ ప్ర‌క‌ట‌న‌ను మ‌ధ్యాహ్నానికే ఉప‌సంహ‌రించుకుంటున్న‌ట్లు కేంద్రం ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. ఆధార్ కార్డుల జిరాక్స్ కాపీలను ఇత‌రుల‌కు అందించే స‌మ‌యంలో జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని, ఎవ్వరికి పడితే వారికి ఆధార్ జిరాక్స్ కాపీలను ఇవ్వవద్దని, వ్యక్తులకుగానీ, సంస్థలకుగానీ ఇవ్వకూడదని, ఇస్తే వాటిని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంటుందని కేంద్రం ఇవ్వాల ఉద‌యం ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది.

అయితే.. ఈ ప్ర‌క‌ట‌న నిమిషాల వ్య‌వ‌ధిలోనే వైర‌ల్ కావ‌డం, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు రావ‌డంతో కేంద్రం వెన‌క‌డుగు వేసింది. ఆధార్ జిరాక్స్ కాపీల‌ను కాకుండా మాస్క్‌డ్ ఆధార్ కార్డుల‌ను మాత్ర‌మే వినియోగించాల‌ని సూచించామ‌ని, అయితే ఈ ప్ర‌క‌ట‌న‌ను చాలా మంది త‌ప్పుగా అర్థం చేసుకున్నార‌ని కేంద్రం తెలిపింది. ఈ కార‌ణంగా ఉద‌యం విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌ను ఉప‌సంహ‌రించుకుంటున్న‌ట్లు కేంద్రం ప్ర‌కటించింది. ఆధార్ ఐడెంటిటీ అథెంటికేష‌న్ ఎకో సిస్ట‌మ్ అనేది ఆధార్ కార్డుల గోప్య‌త‌ను ర‌క్షిస్తుంద‌ని కూడా కేంద్రం వెల్ల‌డించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement