ఆంధ్రప్రభ, హైదరాబాద్ : భూ యాజమాన్య హక్కులు అందని రైతులకు ధరణి పోర్టల్‌లో మరిన్ని ఆప్షన్లు సిద్దమయ్యాయి. రాష్ట్రంలో అనేక రకాల సమస్యలతో పలువురు రైతులకు చెందిన భూముల రికార్డులు, వివరాలు ధరణి పోర్టల్‌లో నమోదు కాలేదు. వీటిని పరిష్కరించాలని కోరుతూ లక్షలాది మంది రైతులు కలెక్టరేట్లు, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రివర్గ ఉపసంగం పలు సిఫార్సులు చేసింది. రైతుబంధు, బీమా పథకాలు వర్తించాలంటే ధరణి పోర్టల్లో భూ సమాచారం ఉండాలి. ఇప్పటికీ సమస్యలు అపరిష్కృతంగా ఉన్న రైతులకు సంబంధించి కొత్త మాడ్యూళ్ల్లు అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది. దాదాపు మూడున్నర లక్షల మంది వివిధ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. 11 లక్షల ఎకరాల సమాచారం పోర్టల్లో నిక్షిప్తం కావాల్సి ఉందని అంచనా. ధరణి సమస్యలపై మంత్రి వర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదిక ప్రకారం కొత్త మాడ్యూళ్లు అందుబాటులోకి రానున్నాయి.
విస్తీర్ణాలలో కోతల సమస్య…
పరిష్కరించాల్సిన సమస్యల్లో ప్రధానంగా భూ విస్తీర్ణాలలో కోతలు పడినవి ఉన్నాయి. ఉన్న భూమి కంటే తక్కువ భూమిని ధరణిలో చేర్చారు. రైతుకు ఉన్న భూమిలో కొంత విస్తీర్ణం కోతకు గురికాగా, పాసుపుస్తకంలోనూ తక్కువ విస్తీర్ణమే నమోదు చేశారు. దీంతో రైతుబంధు కూడా తక్కువ మొత్తం వస్తోంది. కొన్ని జిల్లాల్లో ఆర్‌ఎస్‌ఆర్ సమస్యలున్నవి ఉండగా, కొన్ని చోట్ల సర్వే నంబర్లలో ప్రభుత్వ భూములు ఉండటంతో నిషేధిత జాబితాలోకి కొంత భూమి వెళ్లి రైతులకు తక్కువగా నమోదైన సంఘటనలు ఉన్నాయి. ఈ సమస్యను పరిష్కరించాలంటే కొన్ని జిల్లాల్లో క్షేత్రస్థాయి భూ సర్వే చేయక తప్పని పరిస్థితి ఉంది. ఇలాంటి వారు ఇప్పటికే ధరణి పోర్టల్లో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ ల్యాండ్ మ్యాటర్స్ ఐచ్ఛికంలో దరఖాస్తుచేసినా సరైన పరిష్కారం లభించడం లేదని చెబుతున్నారు.
అసైన్డ్‌దారుల అవస్థలు…
సాగుచేసుకుంటూనే ఉన్నా ఆ భూములకు హక్కులు దక్కని వారిలో అసైన్డ్ లబ్ధిదారులు ఎక్కువ మంది ఉన్నారు. ఇనాం భూములకు కొన్ని జిల్లాల్లో ఓఆర్‌సీ (ఆధీన ధ్రువీకరణ పత్రం) జారీ చేశారు. పాసుపుస్తకాలు మాత్రం ఇవ్వడం లేదు. శివాయిజమేదారీ, లావుణి పట్టాదారులకు కూడా హక్కులు కల్పించి రైతుబంధు అందజేస్తే లబ్ధిచేకూరుతుంది. మంత్రి వర్గ ఉప సంఘం సూచనలతో ఐచ్ఛికాలు, మాడ్యూళ్ల ఏర్పాటుపై రెవెన్యూ యంత్రాంగం కసరత్తు చేస్తున్నా జాప్యం చోటుచేసుకుంటోంది. ఇటీవల నిషేధిత జాబితాలో సుమోటో కేసుల పరిష్కారం అనంతరం దాదాపు 2.80 లక్షల ఎకరాలకు సంబంధించి కొన్ని భూముల సమస్యలు మాత్రం పరిష్కరించారు. అన్ని సమస్యలకు పరిష్కారం లభించాలంటే పోర్టల్లో తగిన సాంకేతిక ఏర్పాట్లు పూర్తి కావాల్సి ఉందని కొందరు అధికారులు పేర్కొంటున్నారు.
మరిన్ని సమస్యల నివారణ దిశగా…
కొత్త రెవెన్యూ చట్టం, ధరణి పోర్టల్‌తో వ్యవసాయ భూములకు పారదర్శకత తీసుకొచ్చిన ప్రభుత్వం మరిన్ని మెరుగైన చర్యలకు శ్రీకారం చుడుతోంది. ప్రభుత్వ దృష్టికి వచ్చిన రకరకాల భూ సమస్యలను సత్వరమే పరిష్కారం చూపేదిశగా సర్కార్ సమాయాత్తమవుతోంది. ఈ దఫా సాదాబైనామాలతోపాటు, పార్ట్ బి వంటి అనేక సమస్యలకు చరగీతం పాడాలని యోచిస్తోంది. వివిధ సమస్యలున్న 17.89 లక్షల ఎకరాల భూములను క్లీయర్ చేసేలా ప్రభుత్వం కార్యాచరణ చేస్తోంది. కొత్త ఆర్వోఆర్ చట్టంతో అనేక చిక్కుముళ్లు వీడినప్పటికీ పార్ట్ బి లో చేర్చిన 17,89,595 ఎకరాల భూములకు చెందిన సమస్యలను తీర్చేందుకు మార్గదర్శకాలు రాకపోవడంతో నెలకొన్న ఇబ్బందులను తీర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్తగా సర్వే నెంబర్ల ప్రకటన, ఎలాంటి సర్వే నెంబర్లు లేని భూముల వివరాలు, అసలు రికార్డుల్లోనే లేని గ్రామాలు, ఖాతా నెంబర్లు లేకుండా ఉన్న భూములు, పట్టా ఒకరిదైతే పొజిషన్‌లో మరోకరు, అమ్మినా యాజమాన్య హక్కు మారని వివరాల వంటివి దాదాపు 54 అంశాలలో ఎదురవుతున్న ప్రతిష్టంభనకు చరమగీతం పాడేలా కసరత్తు చేస్తున్నది.
రాష్ట్రంలో 70లక్షల కమతాలకు చెందిన 57.33 లక్షల కమతాలు వివాదరహితంగా తేల్చారు. కోర్టు ఇతర వివాదాల్లో 10లక్షల ఎకరాలు ఉన్నాయి. సివిల్ కోర్టుల్లో 1,11,258 ఎకరాలు, రెవెన్యూ కోర్టుల్లో 41,961ఎకరాలు, అటవీ సరిహద్దు సమస్యలతో 2,18,980ఎకరాలు, అసైన్డ్ చేసిన అర్హులకు కాకుండా ఇతరుల చేతుల్లో ఉన్న భూమి 2,41,127ఎకరాలు, సాదాబైనామాల వివాదాల భూములు 2,45,668ఎకరాలు, వక్ఫ్ భూములు 3,98,295 ఎకరాలు వంటి సమస్యలున్నాయి. వీటికి మరోసారి స్పష్టత ఇవ్వాల్సి ఉందని ప్రభుత్వం భావిస్తోంది. పార్ట్ బిలో కాకుండా మరోసారి వీటిపై పున:పరిశీలన దిశగా యోచిస్తున్నది. అయితే ఈ విలువైన భూములకు చెందిన వివాదాలు ముఖ్యమైన నాలుగు జిల్లాల్లొనే అధికంగా ఉన్నాయని తేలింది. నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, కొమురం భీం అసిఫాబాద్ జిల్లాల్లోనే వీటి లెక్కలు ఎక్కువగా తేలాయి.
9లక్షల సాదాబైనామాలపై హైకోర్టు స్టే….
రాష్ట్రవ్యాప్తంగా సాదా బైనామాలపై అనిశ్చితి నెలకొంది. హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో 9లక్షల 20వేల దరఖాస్తులు క్రమబద్దీకరణకు ప్రభుత్వానికి చేరాయి. అయితే హైకోర్టు సాదాబైనామాల క్రమబద్దీకరణపై మధ్యంతర ఉత్తర్వులు దాఖలు చేయడంతో ఈ ప్రక్రియ ఆలస్యమవుతోంది. అక్టోబర్ 29వరకు పాత ఆర్వోఆర్ చట్టం అమలులో ఉందని, అక్టోబర్ 30నుంచి కొత్త ఆర్వోఆర్ చట్టం అమలులోకి రావడంతో పాత ఆర్వోఆర్ ప్రకారం దరఖాస్తులు ఎలా స్వీకరిస్తారనే అభ్యంతరాన్ని హైకోర్టు వ్యక్తం చేసింది. కొత్త ఆర్వోఆర్ చట్టంలో సాదాబైనామాల క్రమబద్దీకరణకు ఎటువంటి నియమ నిబంధనలు లేవని, ఈ నేపథ్యంలో సాదాబైనామాల క్రమబద్దీకరణపై ప్రభుత్వం జారీ చేసిన జీవోను కొట్టివేయాలని హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఈ సందర్భంగా గతేడాది నవంబర్‌లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. అక్టోబర్ 29వరకు పాత ఆర్వోఆర్ చట్టం అమలులో ఉన్న కారణంగా ఆరోజు వరకు తీసుకున్న దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయవచ్చని, 13బి సర్టిఫికెట్లు ఇవ్వొచ్చని హైకోర్టు పేర్కొంది. అక్టోబర్ 30నుంచి నవంబర్ 10వరకు తీసుకున్న దరఖాస్తులను పక్కకు పెట్టాలన్న హైకోర్టు సూచన నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోవడంలేదు.
ఈ నేపథ్యంలో వీటిని క్లీయర్ చేసేందుకు కొత్త ఆర్వోఆర్ చట్టంలో సవరణలు చేయాల్సిన పరిస్థితులు అనివార్యమయ్యాయి. శాసనసభలో సవరణ చేయడం లేదంటే ఆర్డినెన్స్ కానీ తీసుకువస్తేనే ఫలితం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విధంగానే 7లక్షలకుపైగా దరఖాస్తులకు చట్టబద్దత రానుంది.