Saturday, September 7, 2024

ధరణిలో మరిన్ని ఆపన్లు.. కొత్తగా 7 మాడ్యూల్స్‌, 18 రకాల సవరణలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: మరింత అధునాతనంగా ధరణి ప్రజాబాహుళ్యంలోకి చేరువ కానుంది, ఇప్పటికే అందరికీ ఆదర్శం అన్న తీరుగా ధరణి పోర్టల్‌ నానాటికీ బలోపేతం అవుతుండగా, త్వరలో సరికొత్త ఆప్షన్లతో అప్‌డేట్‌ అవుతూ భూ సమస్యల పరిష్కారానికి ఏకైక వేదికగా మారుతూ రైతులకు పెద్దన్నగా మారనున్నది. భూ సమస్యల నివారణ, ఒక్క పైసా అవినీతికి ఆస్కారం లేకుండా నేరుగా సమస్యల పరిష్కారం దిశగా ధరణి మరిన్ని ఆప్షన్లతో విలసిల్లనుంది. మంత్రి హరీష్‌రావు నేతృత్వంలోని సబ్‌ కమిటీ చేసిన సిఫార్సులను అసెంబ్లిd సమావేశాలు ముగిసిన వెంటనే అమలులోకి తేనున్నారు. దీంతో ప్రజలకు మరింత మేలు చేకూరనుంది.

ధరణితో పారదర్శకత
సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో తీసుకున్న ధరణి పోర్టల్‌ యోచనతో అనేక దిక్కుతోచని సమస్యలు చిటికెలో పరిష్కారం అవుతూ భూముల రికార్డులలో మానవ ప్రమేయం నివారించి, ఎవరూ కూడా మార్చేందుకు వీలు లేకుండా దుర్బేధ్యంగా మారాయి. గతంలో వీఆర్వో కూడా మార్చేందుకు వీలున్న భూ రికార్డుల నిర్వహణ అంతా సర్కార్‌ చేతిలోకి వెళ్లిపోయి రికార్డులు సురక్షితమయ్యాయి. ప్రతి గుంటకు కూడా యజమాని ఎవరో చిటికెలో ఆన్‌లైన్‌లో చూసి తెలుసుకునే వీలు కల్గింది. దీంతో అవినీతి రహిత, పారదర్శక, వేగవంతమైన విధానం ప్రజల ముంగిట సాక్షాత్కారమైంది. తమ భూమి వివరాలను ఫోన్‌లో చూసుకుని అవసరమైతే ఆన్‌లైన్‌లో పట్టాదార్‌ పాస్‌ పుస్తకం నఖలును వెనువెంటనే క్షణాల్లో డౌన్‌లోడ్‌ చేసుకోగలుగుతున్నారు. సమస్యలుంటే రకరకాల ఆప్షన్లలో మీ-సేవల్లో దరఖాస్తు చేసుకునేందుకు వీలు ఏర్పడింది. నేరుగా కలెక్టర్‌కు ఈ సమాచారం చేరడంతో మధ్యవర్తులు అక్కర్లేకుండా సులభతరమైంది. ధరణి పోర్టల్‌ రాకతో రికార్డుల నిర్వహణ వ్యక్తుల చేతుల్లో నుంచి ప్రభుత్వ వ్యవస్థ పరిధిలోకి వెళ్లింది. దీంతో రైతుకు, ప్రభుత్వానికి నడుమ ధరణి అనుసంధానంగా నిలుస్తూ యాజమాన్య హక్కులకు రక్షణనిస్తోంది. భూమి క్రయవిక్రయాలు, మ్యుటేషన్లలో నిమిషాల వ్యవధిలో పూర్తయిపోతూ నేరుగా ఇంటికే పాస్‌ పుస్తకం పోస్టులో వస్తోంది. దీంతో అక్రమాలు, అవినీతి, జాప్యం లేకుండా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి రాష్ట్రమంతటా నెలకొంది.

అందుబాటులోకి మరో 7 మాడ్యూల్స్‌
ఒక్కో రకమైన సమస్యకు ఒక్కో మాడ్యూల్‌ను ధరణిలో అందుబాటులోకి తెచ్చారు. దీంతో సమస్యల పరిష్కారం అత్యంత సులభతరమైంది. లక్షల మ్యుటేషన్లకు మోక్షం దక్కగా, గ్రీవెన్స్‌ మాడ్యూల్‌తో లక్షలాది సమస్యలు తీరుతున్నాయి. కలెక్టర్లు తమ లాగిన్‌లో సమస్యలను పరిష్కరిస్తూ రైతులకు భరోసా కల్పిస్తున్నారు. తాజాగా ఈ పోర్టల్‌లో మరిన్న ఆప్షన్లు అందుబాటులోకి తెచ్చారు. ధరణి సమస్యలను నివారించి మరింత సౌకర్యవంతంగా రైతాంగానికి అందుబాటులోకి తెచ్చేలా సీఎం కేసీఆర్‌ త్వరలో కీలక నిర్ణయం అమలు చేయనున్నారు. చిక్కులకు చెక్‌ పెట్టి మరింత సరళంగా ధరణిని ఫార్మర్‌ ఫ్రెండ్లీగా చేయాలని సర్కార్‌ యోచిస్తోంది. దీర్ఘకాలిక భూ సమస్యలను ఒక్క క్లిక్‌తో తేల్చివేసేలా పలు మాడ్యూళ్లను ప్రభుత్వం రూపొందిస్తోంది. ఈ మేరకు గ్రామాల వారీగా పరిష్కారం కాకుండా ఉండిపోయిన సమస్యలను కలెక్టర్లు గుర్తించి సిద్ధం చేశారు. తద్వారా ఇకపై ఎటువంటి సమస్యా లేని రీతిలో రైతాంగానికి పరిష్కారమార్గాలకు ప్రభుత్వం సిద్దమైంది. పట్టదారుల పేర్లు తప్పుగా నమోదవడం మొదలుకొని నిషేధిత భూముల జాబితా వరకు ఇబ్బందులను సరిచేసేందుకు ప్రభుత్వానికి కీలక సిఫార్సులు అందాయి. ఇందుకు 7 మాడ్యూల్స్‌ తక్షణమే అందుబాటులోకి తెచ్చేలా కృషి చేస్తోంది.

తప్పుగా నమోదైన పట్టాదారు పేరు నుంచి పొరపాటుగా ప్రభుత్వ, ఇతర భూములుగా నమోదైన పట్టాభూముల సరిజేత, మార్పు చేర్పులు, మిస్సింగ్‌ సర్వే నెంబర్లు, భూమి విస్తీర్ణం సరిజేత, ఒకరికంటే ఎక్కువ కొనుగోలు దారులు, అమ్మకం దారులను అనుమతించడం వంటి కీలక సమస్యలకు వీటితో పరిష్కారం దక్కనుంది. పట్టాదారుల పేరు, వివరాలు, అక్షర దోషాలు, తప్పుగా నమోదైన వాటిని సరిజేత, వంటి వాటికి ఆన్‌లౖన్‌లో ఫిర్యాదులు తీసుకొని ఆన్‌లైన్‌లోనే కలెక్టర్లు సరిదిద్దేలా చర్యలు తీసుకోనున్నారు. అదేవిధంగా పలు సబ్‌ డివిజన్లు, సర్వే నంబర్లు ధరణిలో కనిపించడం లేదు. భూ రికార్డుల అప్‌డేషన్‌లో భాగంగా ఈ మిస్సింగ్‌ సర్వే నంబర్లకు పాస్‌ పుస్తకాలు ఇవ్వలేదు. వీరికోసం ప్రత్యేకంగా మాడ్యూల్‌ను అందుబాటులోకి తేనున్నారు. కొనుగోలు కోసం స్పెషల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నిగా ప్రతినిధిని నియమించే వెసులుబాటు, ఎన్నారైలకు ఇతర సౌకర్యాలను అందుబాటులోకి తేనున్నారు. ఓఆర్సీ, పీటి సర్టిఫికెట్ల జారీ, వంటి వాటికి మరో ఆప్షన్‌ను తేనున్నారు. పాత రికార్డులను అనుసరించి భూమి వివరాలను, విస్తీర్ణాలను సరిదిద్దడం వంటి వాటికి కూడా ఆప్షన్‌ రానుంది.

18రకాల సవరణలు
ఈ మేరకు 7 ఆప్షన్లతో తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ధరణి పోర్టల్‌లో దొర్లిన తప్పులను సరిదిద్ది, సాంకేతికంగా మార్పులు చేసేందుకు మంత్రి హరీష్‌రావు అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించిన ప్రభుత్వం తాజాగా కలెక్టర్ల నుంచి ధరణి సమస్యలపై వివరాలను సేకరించింది. సుమారు 18రకాల సవరణలకు సూచనలు రావడంతో సీఎం కేసీఆర్‌ తక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో నిషేదిత జాబితాలోనుంచి భూములను క్లియర్‌ చేసేందుకు ప్రత్యేక ఆప్షన్‌ను కలెక్టర్ల లాగిన్‌లో ఇప్పటికే చేర్చారు. సుమారు 10లక్షలకు పైగా ఎకరాలకు చెందిన భూములు నిషేధిత జాబితాలో ఉండటంతో ఇబ్బందులు వస్తున్నాయని ప్రభుత్వానికి నివేదిక అందింది. ఈ నేపథ్యంలో గ్రామస్థాయిలోనే ప్రభుత్వ భూముల రిజిస్టర్‌ రూపొందించాలనే యోచనతోపాటు, ప్రభుత్వ భూముల పరిరక్షణ, జియో కోఆర్డినేట్స్‌ పిక్స్‌ చేయాలని, సర్వే మ్యాపింగ్‌ వివరాలను రిజిస్ట్రేషన్‌ శాఖకు పంపే యోచన పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు తీసుకున్న చర్యలపై జిల్లాల వారీగా అఫిడవిట్లు రూపొందించాలని కూడా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement