Tuesday, November 19, 2024

మన పంటలకు మ‌రింత ప్రోత్సాహం.. తాండూరులో కంది అభివృద్ధి కేంద్రం..

దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన తాండూరు కందిని మరింతగా ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ దిశగా చకచకా చర్యలు చేప్టటాలని నిర్ణయించింది. ఈ మేరకు వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నీరంజన్‌రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించారు. తాండూరు కందిపప్పును ప్రోత్సహించాలని ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి చేసిన విజ్ఞ‌ప్తి మేర‌కు కంది అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. దీంతో రైతులకు మేలు జరగడంతో పాటు తాండూరు కందిపప్పుకు మరింత ప్రాచుర్యం లభించ‌నుంద‌ని రైతులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

(ప్రభన్యూస్‌, వికారాబాద్‌) : అత్యంత చవకగా అత్యధిక పోషకాలతో లభించే ఆహార పదార్థంగా కందిపప్పును పేర్కొంటారు. కందిపప్పును పేదల ఆహారం అని కూడా పిలుస్తారు. సగటు మధ్యతరగతి కుటుంబం రోజూ కందిపప్పుతో కూడిన ఆహారం తీసుకోవడం జరుగుతోంది. గ్రామీణ ప్రజలు ప్రతిరోజు తీసుకునే ఆహారంలో కందిపప్పు భాగంగా మారింది. ఇటీవల కాలంలో కందిపప్పుకు విశేష ప్రాచుర్యం లభిస్తోంది. ముఖ్యంగా తాండూరు కందిపప్పుకు దేశవిదేశాలలో డిమాండ్‌ పెరిగింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా తాండూరు కందిపప్పు పేరుతో విక్రయాలు సాగుతున్నాయి. జిల్లాలోని తాండూరు ప్రాంతంలో లభిస్తున్న కందిపప్పు నాణ్యత దేశంలో మరెక్కడా లేకపోవడం దీని ప్రత్యేకత. దీంతో కంది పంట సాగును మరింతగా పెంచాలని.. తాండూరు కందిపప్పును ప్రోత్సహించాలని ప్రభుత్వంతో పాటు ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం పనిచేస్తోంది.

జిల్లాలోని తాండూరు ప్రాంతంలో ఏటా ఖరీఫ్‌లో రైతులు కందిపంట సాగు చేస్తారు. ఎక్కువగా నల్లరేగడి నేలల్లో ఈ పంట సాగు చేస్తారు. ఏటా వానాకాలంలో దాదాపు 50 వేల హెక్టార్లలో రైతులు కంది సాగు చేస్తారు. తాండూరు చుట్టూరా ఉన్న కర్నాటక లాంటి సరిహద్దు ప్రాంతాల్లో కూడా కంది విస్తారంగా సాగులో ఉంది. ఇక్కడ రైతులు సాగు చేస్తున్న కంది పంటలో దిగుబడి కూడా జాతీయ సగటు కంటే అధికంగా ఉంటోంది. ఎకరా పొలంలో రైతులు దాదాపు 10 క్వింటాళ్ల పైబడి దిగుబడి సాధిస్తున్నారు. దేశంలో సగటు దిగుబడి మాత్రం 8 క్వింటాళ్లు ఉంది. తాండూరు ప్రాంతంలో ఉన్న పప్పు మిల్లులలో నూర్పిడి చేసి కందిపప్పుగా మారుస్తున్నారు. దీంతో తాండూరు కందిపప్పు నాణ్యత మరింత పెరుగుతోంది. తాండూరు కందిపప్పుతో చేసిన ఆహారం 24 గంటల వరకు కూడా పాడుకాకుండా ఉంటుంది. ఈ కారణంగా తాండూరు కందిపప్పుకు దేశవిదేశాలలో డిమాండ్‌ ఉంది. అయితే ఇటీవల కాలంలో ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో కంది సాగు చేస్తున్న రైతులు పత్తి వైపు మళ్లారు. ఈ కారణంగా కంది సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. మహారాష్ట్ర.. కర్ణాటక.. ఆంధ్రప్రదేశ్‌లో రైతులు పండించిన కందుల నుంచి ఉత్పత్తి చేసిన కందిపప్పును తాండూరు కందిపప్పు పేరుతో వ్యాపారులు విక్రయించడం ప్రారంభమైంది.

ఈ పరిస్థితిని అరికట్టడంతో పాటు తాండూరు ప్రాంతంలో కంది సాగు విస్తీర్ణంను పెంచి తాండూరు కందిపప్పును ప్రోత్సహించాలని చాలా కాలంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ యోచిస్తున్నారు. పత్తి స్థానంలో కంది పంటను ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖకు సూచనలు చేశారు. ఇదే విషయాన్ని తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి అసెంబ్లిలో ప్రస్తావించారు. తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తాండూరు కంది పంటను ప్రోత్సహించేందుకు కంది అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా కంది పంటకు సంబంధించి కొత్త వంగడాలను సృష్టించడం.. వాటిని రైతులకు పరిచయడం చేయడం.. తాండూరు కందిపప్పును అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్స‌హించే చ‌ర్య‌లు చేప‌ట్ట‌నున్నారు.

కంది రైతులకు మేలు : రోహిత్‌ రెడ్డి..

- Advertisement -

తాండూరు ప్రాంతానికి పేరు ప్రఖ్యాతలు తీసుకవచ్చిన కందిపప్పును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం చాలా సంతోషం. కంది సాగు విస్తీర్ణాన్ని పెంచి కందిని ప్రోత్సహించేందుకు తాండూరులో కంది అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రైతులకు ఎంతో మేలు జ‌రుగుతుంది.

బోర్డు స్థానంలో అభివృద్ధి కేంద్రం : డాక్టర్‌ సుధాకర్‌, వ్యవసాయ శాస్త్రవేత్త..

కేంద్ర ప్రభుత్వం వివిధ పంటలను ప్రోత్సహించేందుకు బోర్డులను ఏర్పాటు చేయడంపై చాలా కాలంగా నిర్ణయం తీసుకోవడం లేదు. కంది బోర్డుతో పాటు పసుపు బోర్డు ఏర్పాటు విషయంలో జాప్యం చేస్తోంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆయా పంటల సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం కంది బోర్డు స్థానంలో కంది అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ప్రభుత్వం నిర్ణయంతో కంది రైతులకు మేలు జరుగుతుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement