కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 40వ రోజుకు చేరుకుంది. ఇవ్వాల (సోమవారం) కర్నాటకలోని బళ్లారికి పాదయాత్ర చేరుకోగా రాహుల్ తనతోకలిసి నడుస్తున్న వారితో సరదాగా చిట్‌చాట్ చేశారు. కాగా, కొంతమంది రాహుల్ ముఖంతో పాటు చర్మం కమిలిపోకుండా ఉండేందుకు ఎట్లాంటి లోషన్ వాడుతారని, ఏ సన్‌స్క్రీన్‌ని ఉపయోగిస్తారని కొంతమంది యువతీ, యువకులు ఫన్నీ క్వశ్చన్స్ అడిగారు.. దాంతో రాహుల్.. ‘‘అమ్మ నాకు సన్‌స్క్రీన్ పంపింది. కానీ, నేను దానిని ఉపయోగించడం లేదు”అని అంతే సరదాగా సమాధానమిచ్చారు. దీంతో అక్కడున్న వారు ‘‘అయినా.. మీ ముఖం సూర్యరశ్మి మాదిరిగా ప్రకాశిస్తుంది’’ అని అక్కడున్న వారు నవ్వుతూ కామెంట్ చేశారు..
ఇక.. పాదయాత్రలో పాల్గొన్న వారితో సరదాగా మాట్లాడుతూనే రాహుల్ గాంధీ ఇలా అన్నారు.. “వాళ్లు (బీజేపీ) అన్ని సంస్థలను స్వాధీనం చేసుకుంటే దేశం నిశ్శబ్దంగా మారుతుందని భావిస్తున్నారు. వారు తప్పుడు అవగాహనలో ఉన్నారు. ఈ దేశం ఎప్పటికీ నిశ్శబ్దంగా మారదు. ఈ దేశం నిత్యం పోరాడుతూనే ఉంటుంది” అని బీజేపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య.. డికె శివకుమార్‌తో కలిసి నడుస్తున్నప్పటి నుండి తన తల్లి సోనియా గాంధీ షూలేస్‌లు కట్టుకోవడం వరకు.. భారత్ జోడో యాత్రలో ఇట్లాంటి అనేక డిఫరెంట్ మూమెంట్స్.. వాటి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక.. రాహుల్ గాంధీ తన 3,570 కిలోమీటర్ల యాత్రను సెప్టెంబర్ 7వ తేదీన కన్యాకుమారి నుంచి ప్రారంభించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో తమ అవకాశాలను మెరుగుపరుచుకునేందుకు దీన్ని వ్యూహంగా చేపట్టారు. ఈ యాత్ర జమ్మూ కాశ్మీర్లో ముగియనుంది. దాదాపు 150 రోజులపాటు సాగనున్న ఈ పాదయాత్ర ఈ మధ్యనే కర్నాటక రాష్ట్రంలో 1000 కిలోమీటర్ల మార్కును చేరుకుంది.
భారతదేశ చరిత్రలో ఏ వ్యక్తి ఇంత సుధీర్ఘ పాదయాత్ర చేసిన దాఖలాలు లేవు. గతంలో మహాత్మా గాంధీ దండి మార్చ్ గుజరాత్ రాష్ట్రంలోని సబర్మతి ఆశ్రమం నుండి దండి (నవసరి) వరకు కాలినడకన (24 రోజులలో 389 కిలోమీటర్లు) సుదీర్ఘమైన నడక చేపట్టారు. ఆ తర్వాత మళ్లీ భారత్ జోడో పేరుతో రాహుల్ గాంధీ చేపట్టిన ఈ యాత్రకు పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తోంది.