Friday, November 22, 2024

Cricket: వరల్డ్ కప్ లో ఒక్క మ్యాచ్ గెలవని ఆఫ్గాన్‌.. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న మహ్మద్ నబీ

ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్ర‌క‌టించాడు మహ్మద్ నబీ. ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో ఆఫ్గాన్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు. ఈ వరల్డ్ కప్ లో తాము గానీ, తమ అభిమానులు గానీ ఊహించని ఫలితాలు వచ్చాయని తెలిపాడు. అందరిలానే తమను కూడా ఈ పరాజయాలు బాధించాయి వెల్లడించాడు.

“గత ఏడాది కాలంగా మా జట్టు సన్నాహాలు ఓ పెద్ద టోర్నీకి అవసరమైన స్థాయిలో లేవు. ఓ కెప్టెన్ గా నా మాటకు విలువ లేకుండా పోయింది. ఇటీవల కొన్ని పర్యటనల్లో జట్టు మేనేజ్ మెంట్, సెలెక్షన్ కమిటీ, నాకు మధ్య సమన్వయం కొరవడింది. దాంతో జట్టులో సమతూకం కొరవడింది. ఈ నేపథ్యంలో జట్టు కెప్టెన్ గా తక్షణమే వైదొలుగుతున్నాను. జట్టు మేనేజ్ మెంట్, జట్టు ఎప్పుడు నా సేవలు కోరుకున్నా అందించడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ వరల్డ్ కప్ లో కొన్ని మ్యాచ్ లు వర్షం కారణంగా ప్రభావితమైనప్పటికీ మా కోసం మైదానానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీ ప్రేమాభిమానాలు మాకెంతో విలువైనవి” అంటూ నబీ తన ప్రకటనలో వివరించాడు.

టీ20 వరల్డ్ కప్ లో గ్రూప్-1లో ఉన్న ఆఫ్ఘనిస్థాన్ మొత్తం 5 మ్యాచ్ లు ఆడి 3 మ్యాచ్ ల్లో ఓటమిపాలైంది. మరో రెండు మ్యాచ్ లు వర్షం కారణంగా రద్దయ్యాయి. దాంతో గ్రూప్ దశలో ఒక్క విజయం లేకుండానే ఆఫ్ఘన్ జట్టు టోర్నీని ముగించింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement