తెలంగాణలో సాగవుతున్న పంటలు చాలావరకు వైరస్, పురుగుల బారిన పడుతున్నాయి. తెగుళ్లు, పురుగుల సమస్యతో అన్నదాతలు అతలాకుతలం అవుతుండగా తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని మిర్చి తోటలపై కొత్త రకం వైరస్ దాడి చేయడంతో సగానికి పైగా తోటలను రైతులు మధ్యలోనే తీసివేశారు. ఇదే నేపథ్యంలో ప్రస్తుతం యాసంగి సీజన్లో సాగవుతున్న పలు పంటలకు తెగుళ్లు, వైరస్లు సోకుతున్నాయి. దీంతో యాసంగిలో సాగవుతున్న పంటలకూ ఈ బెడద తప్పేటట్టు లేదు. ఇందులో భాగంగా ప్రస్తుతం రాష్ట్రంలో వరి తరువాత రెండో స్థానంలో సాగవుతున్న మొక్క జొన్నలో మొగిలి సమస్య ఏర్పడుతుంది. అయితే ఇది లద్దె పురుగు కారణంగా వస్తుందని భావిస్తున్నా.. నివారణకు ఎన్ని రకాల మందులు వినియోగించినా ఫలితం లేదని రైతులు చెబుతున్నారు. దీంతో సమస్యను అరికట్టేందుకు రైతులు విరివిగా పురుగు మందులను పిచికారీ చేస్తున్నా ఎలాంటి ఫలితం లేకుండా పోతుంది.
పురుగుతో మొక్క పెరుగుదలపై ప్రభావం..
మొక్కజొన్నలో ప్రస్తుతం ఆశించిన పురుగులతో మొక్క పెరుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతోందని రైతులు అంటున్నారు. అసలు ఈ సమస్య ఏ రకమైన పురుగు వలన వస్తుందనేది కూడా అంతుచిక్కడంలేదని, దీని నివారణకు ఎన్ని రకాల మందులు వినియోగించినా ఫలితం రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఈసారి వరిని తగ్గించి ఇతర పంటలు వేయమనడంతో ఈసారి మొక్కజొన్నను గరిష్టంగా సాగుచేస్తుండగా ఆశిస్తున్న పురుగులతో ఈసారి నష్టమం ఏర్పడుతుందేమోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతానికి లద్దె పురుగు వలన ఈ సమస్య వస్తుందని రైతులు భావిస్తున్నారు. అయితే దీని వలన మొక్క ఏపుగా పెరగ కుండా ఉండ డంతో పాటు పెరుగుతున్న మొక్క యొక్క ఆకులను మధ్య నుంచి కట్ చేస్తుంది. ఇది మొగిలిని ఎదగకుండా చేయడంతో దీని ప్రభావం మొక్క పెరుగుదలపై పడుతోంది. దీని నివారణ కోసం మొక్కలోని మొగిలి ఎదిగే స్థానంలో మొక్క మొక్కకు మందులను వేస్తున్నారు. అయినా నివారణ కాకపోగా అసలు మొక్క ఆశించిన మేర ఎదగకపోవడం గమనార్హం. ప్రధానంగా మొక్క జొన్న మొక్కలకు కాండం ఏపుగా వస్తేనే దిగుబడి ఆశించిన మేర వస్తుంది. కానీ ప్రస్తుతం మొగిలి సమస్య ఏర్పడడంతో ఇబ్బందులు తప్పవని రైతులు అంటున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..