తెలంగాణ, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరమ్ అసెంబ్లిdలకు ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య పోస్టర్ల యుద్ధం పతాక స్థాయికి చేరుకుంది. కాంగ్రెస్ పార్టీ దీనికి నాంది పలికింది. అతి పెద్ద అబద్ధాల కోరు ఎవరు? అని ప్రశ్నకు అది నేనే అని ప్రధాని నరేంద్ర మోడీ సమాధానమిస్తున్నట్టుగా ఒక పోస్టర్‌ను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనికి బదులుగా నవయుగపు రావణుడు అనే శీర్షికతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని విమర్శిస్తూ ఒక పోస్టర్‌ను బీజేపీ షేర్ చేసింది. బదులుగా వ్యాపారవేత్త గౌతమ్ అదానీ చేతిలో ప్రధాని నరేంద్ర మోడీ కీలుబొమ్మ అనే అర్థం వచ్చేలా మరో పోస్టర్‌ను కాంగ్రెస్ పార్టీ శుక్రవారం సోషల్ మీడియాలో షేర్ చేసింది.
రాహుల్‌ను రావణుడిగా పేర్కొంటూ బీజేపీ షేర్ చేసిన పోస్టర్‌పై ప్రధాని మోడీని, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నిలదీశారు. ”గౌరవనీయులైన ప్రధాన నరేంద్ర మోడీజీ, జేపీ నడ్డాజీ రాజకీయాలను, చర్చను ఏ స్థాయికి దిగజార్చాలని మీరు కోరుకుంటున్నారు? మీ పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో హింసాత్మకమైన, రెచ్చగొట్టే పోస్టులతో మీరు ఏకీభవిస్తున్నారా?” అని ప్రశ్నించారు. ”హుందాతనం కోసం మీరు ప్రమాణం చేసి ఎక్కువరోజులు కూడా కాలేదు. ప్రజలకు ఇచ్చిన హామీల్లాగానే మీరు చేసిన ప్రమాణాలను మరిచిపోయారా?” అని ఆమె నిలదీశారు.