Thursday, November 21, 2024

Big Story: మోడీ విదేశీ పర్యటనలు.. యూఏఈతో ప్రారంభం.. అంతర్జాతీయ సదస్సులకు హాజరు

విదేశాలతో భారత్‌ సత్సంబంధాలు నెలకొల్పే దిశగా ప్రధాని నరేంద్ర మోడీ వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈనేపథ్యంలోనే మిత్రదేశాలైన యూఏఈ, కువైట్‌ల 2022 సంవత్సరంలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. అయితే ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో ఈ పర్యటన రద్దు అయినట్టు సమాచారం. దుబాయ్‌ 2020 ఎక్స్‌పోను సందర్శించేందుకు నిర్ణయించారు. జనవరి 6న మోడీ యూఏఈ వెళ్లాల్సి ఉంది. భారత్‌-యూఏఈ మధ్య దౌత్య సంబంధాలకు 50ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ పర్యటన ఖరారు చేశారు. 2015, 2018, 2019లో మోడీ యూఏఈని సందర్శించారు. యూఏఈలో 40లక్షల మంది భారతీయులు, కువైట్‌లో 10 లక్షల మంది నివాసం ఉంటున్నారు. వాతావరణం, జీవ వైవిధ్యం, అంతరిక్షం, పట్టణ, గ్రామీణ అభివృద్ధి, ప్రపంచ లక్ష్యాలు, ఆరోగ్యం, ఆహారం, వ్యవసాయం, జీవనోపాధిపై యూఏఈతో చర్చించాలని నిర్ణయించారు. గతంలో యూఏఈ పర్యటనకు వెళ్లి మోడీ.. ఆ దేశ అత్యున్నత పురస్కారం ఆర్డర్‌ ఆఫ్‌ జాయేద్‌ను స్వీకరించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి మోడీ చేసిన కృషికి యూఏఈ ఈ పురస్కారాన్ని అందించింది.

జర్మన్‌ ఇంటర్‌ -గవర్నమెంట్‌ కన్సల్టేషన్స్‌ (ఐజీసీ) కోసం ప్రధాని మోడీ జర్మనీ వెళ్లనున్నారు. రెండు దేశాల మధ్య.. ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ భేటీ నిర్వహిస్తారు. జర్మనీ మాజీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెలా 2019లో ఐజీసీ కోసం భారత్‌కు వచ్చారు. 2022, జీ-7 సమ్మిట్‌కు జర్మనీ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇందులో భాగంగా కూడా మోడీ జర్మనీని పర్యటిస్తారు. ప్రధాన మంత్రి పర్యటనల్లో ఎక్కువ భాగం 2022లో యూరప్‌లోనే ఉంటుంది. రెండో ఇండియా-నార్డిక్‌ సమ్మిట్‌ కోసం మోడీ డెన్మార్క్‌ వెళ్లే అవకాశం ఉంది. ఈ ఏడాది అక్టోబర్‌లో డెన్మార్క్‌ ప్రధాని మెట్టె ఫ్రెడరిక్‌ పర్యటన సందర్భంగా 2022లో కోపెన్‌హాగన్‌లో జరగనున్న రెండో ఇండియా నార్డిక్‌ శిఖరాగ్ర సదస్సుకు ఆమె.. భారత్‌ ప్రధానిని ఆహానించారు. ఈ సమ్మిట్‌లో సీడన్‌, నార్వే, ఫిన్లాండ్‌, డెన్మార్క్‌, ఐస్‌లాండ్‌ దేశాలు పాల్గొంటాయి.

జీ-20 సమ్మిట్‌కు ఈ ఏడాది ఇండోనేషియా నేతృతం వహిస్తున్నది. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో 2022 అక్టోబర్‌లో జరిగే సమ్మిట్‌లో ప్రధాని మోడీకి అధ్యక్ష పదవిని అప్పగిస్తారు. భారతదేశం 2023లో మొదటి సారిగా జీ-20 సమ్మిట్‌కు ఆతిథ్యం ఇవనుంది. జీ-20 అధ్యక్ష పదవిని భారత్‌కు అప్పగించాల్సి ఉన్నందున మోడీ ఇండోనేషియా వెళ్తారు. భారత్‌ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి 2022లో రష్యా వేదిక కానుంది. రెండు దేశాల మధ్య ప్రతీ సంవత్సరం జరిగే శిఖరాగ్ర సమావేశానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ డిసెంబర్‌లో న్యూఢిల్లీకి వచ్చారు. 2019లో రష్యాలోని వ్లాడివోస్టాక్‌లో నిర్వహించిన శిఖరాగ్ర సదస్సుకు మోడీ చివరి సారిగా హాజరయ్యారు.

రెండో క్వాడ్‌ ఇన్‌ పర్సన్‌ సమ్మిట్‌కు జపాన్‌ వేదిక అవుతున్నది. భారత్‌, యూఎస్‌, ఆస్ట్రేలియా, జపాన్‌ల క్వాడ్‌ గ్రూపింగ్‌ ఈ సంవత్సరం వర్చువల్‌గా భేటీ అయ్యింది. 2022లో జపాన్‌ను మోడీ పర్యటించనున్నారు. ఫిబ్రవరిలో ఈ క్వాడ్‌ సమ్మిట్‌ జరగనుంది. పొరుగున్న శ్రీలంకలో కూడా మోడీ పర్యటించనున్నారు. బే ఆఫ్‌ బెంగాల్‌ ఇంటివెటివ్‌ ఫర్‌ మల్టిd-సెక్టోరల్‌ టెక్నికల్‌ అండ్‌ ఎకనామిక్‌ కోఆపరేషన్‌లో పాల్గొనేందుకు మోడీ వెళ్తారు. కామన్వెల్త్‌ సదస్సుకు ఆఫ్రికాలోని రువాండా ఆతిథ్యం ఇవ్వనుంది. కరోనా కారణంగా 2020, 2021 సమ్మిట్‌లు వాయిదా వేయబడ్డాయి. అదేవిధంగా ఆసియన్‌ సమ్మిట్‌ కోసం కంబోడియా, షాంఘై కో ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ సమ్మిట్‌ కోసం ఉజ్బెకిస్తాన్‌, బ్రిక్స్‌ సదస్సు కోసం చైనాకు మోడీ వెళ్లనున్నారు. బ్రిక్స్‌, ఆసియన్‌ సమ్మిట్‌లు గత రెండేళ్లుగా వర్చువల్‌గా జరిగాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్‌,  ట్విట్టర్    పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement