ద కశ్మీర్ ఫైల్స్ చిత్ర బృందం ప్రధాని నరేంద్ర మోడీని కలిసింది. కాగా డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి, ఆయన భార్య, నటి పల్లవి జోషి, నిర్మాత అభిషేక్ ప్రధానిని కలిసిన వారిలో ఉన్నారు. వారికి ప్రధాని అభినందనలు తెలియజేయడంతోపాటు.. కశ్మీర్ ఫైల్స్ సినిమా తీయడం పట్ల ప్రశంసించారు. సినిమా గురించి వారు ప్రధానికి వివరించారు. 1990 కశ్మీర్ తిరుగుబాటు సమయంలో పెద్ద ఎత్తున వలసపోయిన కశ్మీరీ పండిట్లు, ఊచకోతల అంశాలను ఈ సినిమాలో చూపించారు. ఈ నెల 11న ఈ సినిమా బాక్సాఫీసు ముందుకు వచ్చింది. మొదటి రోజే దేశీయంగా రూ.3.55 కోట్లు, విదేశాల్లో 0.70 లక్షల వసూళ్లతో రికార్డు నమోదు చేసింది. ప్రధానితో చిత్ర బృందం భేటీ వివరాలను అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ ట్విట్టర్ లో వెల్లడించారు. కశ్మీర్ ఫైల్స్ చిత్ర బృందం ప్రధానిని కలుసుకున్న నేపథ్యంలో నెటిజన్లు మరో విడత ‘బాయ్ కాట్ కపిల్ శర్మ షో’అంటూ ట్రెడింగ్ మొదలు పెట్టారు. కపిల్ శర్మ నిర్వహించే టీవీ షో ‘ద కపిల్ శర్మ షో’ (టీకేఎస్ఎస్)లో తాము పాల్గొనేందుకు నిరాకరించాడంటూ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి లోగడ ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. ‘‘ద కశ్మీర్ ఫైల్స్ సినిమాను ప్రధాని మోడీజీ ప్రోత్సహించారు. బాలీవుడ్ గ్యాంగ్ బూట్లను నాకే కపిల్ శర్మ ప్రమోషన్ మాకు అవసరం లేదు’’అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేయడం గమనార్హం.
Advertisement
తాజా వార్తలు
Advertisement