Saturday, November 23, 2024

మోదీజీ, క్యాహువా తేరా వాదా?.. ప్ర‌ధాని ప్ర‌సంగంపై కేటీఆర్ కామెంట్స్‌!

స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల వేళ ఎర్ర‌కోట వ‌ద్ద ప్ర‌ధాని మోదీ చేసిన ప్ర‌సంగంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ కామెంట్స్ చేశారు. 2022 నాటి లక్ష్యాలనే సాధించలేని ప్రధాని మోదీ.. 2047 కోసం కొత్త లక్ష్యాలను నిర్దేశించడమేమిటని ఎద్దేవాచేశారు. ట్విట్టర్‌ వేదికగా స్పందించిన మంత్రి కేటీఆర్‌.. నిర్దేశించుకొన్న లక్ష్యాలను సాధించడానికి కావాల్సిన చిత్తశుద్ధి మోదీకి లేదన్నారు. రాబోయే పాతికేండ్లకు కొత్త లక్ష్యాలు నిర్దేశించడం వినడానికి బాగున్నా.. ఇప్పటిదాకా సాధిస్తామని చేసిన వాగ్దానాలు ఏమయ్యాయని ప్రశ్నించారు కేటీఆర్‌.

‘ఎర్రకోట వేదికగా 2047 కోసం ప్రధాని మోదీ తన ప్రసంగంలో కొన్ని కొత్త లక్ష్యాలపై మాట్లాడం వినడానికి ఎంతో బాగున్నది. కానీ, అధికారంలో వచ్చినప్పటి నుంచి చేసిన వాగ్దానాల్లో ఏ ఒక్కటీ నెరవేరలేదన్న సంగతిని మోదీ ఇప్పటికైనా గుర్తించాలి. 2014లో 2022 నాటికి దేశ రైతుల ఆదాయం రెట్టింపు, ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు, విద్యుత్తు, టాయిలెట్‌, ప్రతి భారతీయుడికీ సొంత ఇల్లు కట్టిస్తామనడంతో పాటు.. 2018లో మన ఆర్థిక వ్యవస్థను 2022 నాటికి ఐదు ట్రిలియన్‌ డాలర్లుగా మారుస్తానన్న హామీల్లో ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చలేదు’ అని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

ఇక‌.. ‘లక్ష్యాల సాధనలో ఎదురైన వైఫల్యాన్ని ఒప్పుకోకుండా కొత్తవాటి గురించి చెప్తే విశ్వసనీయత ఏముంటుంది? మీ లక్ష్యాలను మీరే గుర్తించలేనప్పుడు జవాబుదారీతనం ఎకడ ఉంటుంది’ అని ప్రశ్నించారు. ప్రధాని గతంలో చేసిన వాగ్దానాల గురించి దేశ ప్రజలు తెలుసుకోవాలని భావిస్తున్నారంటూ.. క్యా హువా తేరా వాదా అనే హ్యాష్‌ ట్యాగ్‌తో మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. నెటిజన్లు సైతం మంత్రి కేటీఆర్‌కు మద్దతుగా మోదీపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

సోషల్​ మీడియాలో పెద్ద ఎత్తున షేర్​ అవుతున్న మీమ్స్​.. బుల్​డోజర్లతో అమెరికాలో నిరసన ప్రదర్శన
Advertisement

తాజా వార్తలు

Advertisement