బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోదీ ఇవ్వాల పార్టీ నిర్వహించిన బహరింగసభలో ప్రసంగించారు. తొలుత సభికులను ఉద్దేశించి తెలుగులో మాట్లాడారు. ఎక్కడెక్కడి నుంచో సభకు పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలకు, ముఖ్య నేతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ ప్రజలంతా ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తోందని, ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు రావడం చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు మోదీ. మీ ప్రేమ, ఆశీర్వాదానికి ధన్యవాదాలు అని తెలిపారు.
యాదాద్రి లక్షినర్సింహస్వామి, అలంపూర్లో జోగుళాంబ, వరంగల్లో భద్రకాళి దేవతలు ఉన్న అపూర్వమైన గడ్డ తెలంగాణ అని, రాణి రుద్రమ, ప్రతాపరుద్రుడు, కొమురం భీం వంటి పరాక్రమాలు అపూర్వమైనవని ప్రధాని మోదీ అన్నారు. భద్రాచలం రామదాసు, పాల్కూరి సోమన్న ఉన్న గడ్డ ఇదన్నారు. తెలంగాణలో కళ, కౌశలం, పనితనం పుష్కలంగా ఉందన్నారు. ధైర్య పరాక్రమాల పుణ్యభూమి తెలంగాణ. అందుకే ఇక్కడ బీజేపీ జాతీయ సభలు నిర్వహించాం. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ కోసం బీజేపీ శ్రమిస్తోందన్నారు.