Friday, November 22, 2024

పెళ్లి వయస్సు పెంచితే తప్పేంటి..? మోడీ

ఇది కొందరిని బాధిస్తోంది..
ఇంకా చదువుకునే అకాశం ఇద్దాం..
యువతులూ ఇదే కోరుకుంటున్నారు..
పురుషులతో సమానంగా ఉండాలి..
మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం
ఇంటికే పరిమితం కావొద్దు..
ఆర్థిక చేయూత అందిస్తాం..
ప్రయాగ్‌రాజ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ..
స్వయం సహాయ గ్రూపులకు రూ.1000 కోట్లు బదిలీ..

ప్రయాగ్‌రాజ్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌) : మహిళా సాధికారతే తమ ప్రభుత్వ లక్ష్యమని, బాలికలు చదువుకుంటేనే దేశానికి ఎంతో మంచిదని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. యువతుల పెళ్లి వయస్సు పెంపు గురించి కీలక నిర్ణయం తీసుకున్నామన్నారు. గతంలో 18 ఏళ్లు ఉండేదని, దాన్ని 21 ఏళ్లకు పెంచినట్టు వివరించారు. ఇలా చేయడంతో.. వారు చదువుకునేందుకు అవకాశం దక్కుతుందని తెలిపారు. బాలికలు కూడా ఉన్నతమైన విద్యాభ్యాసం చేయాలని కోరుకుంటున్నారని అన్నారు. ప్రయాగ్‌రాజ్‌లో పర్యటించిన మోడీ.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. సుమారు 16లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూర్చే 1.60 లక్షల స్వయం సహాయక సంఘాలకు రూ.1,000 కోట్లను ఆన్‌లైన్‌లో బదిలీ చేశారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు..మహిళల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. మహిళలు ఎందులోనూ తక్కువ కాదని, పురుషులతో సమానం అని చెప్పారు.

విపక్షాలపై విమర్శలు..

ఏ పార్టీ.. నేత పేరును ప్రస్తావించకుండా.. యూపీ విపక్షాలపై మోడీ విరుచుకుపడ్డారు. ఎవరికైనా.. యువతుల పెళ్లి వయస్సు పెంపుతో ఇబ్బంది ఉంటే.. మహిళలే వారిని చూసుకుంటారని చెప్పుకొచ్చారు. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు, కాంగ్రెస్‌, సీపీఎం తదితర పార్టీల నేతలు పార్లమెంట్‌లో ప్రతిపాదించిన బిల్లును వ్యతిరేకిస్తామని ప్రకటించారన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, విద్య, ఆర్థిక చేయూత, మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఐదేళ్ల క్రితం వరకు యూపీలో గుండాల రాజ్యం ఉండేదని, మహిళలకు రక్షణ లేకుండా పోయేదని గుర్తు చేశారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. గతంలో పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే.. రేపిస్టులు, నేరస్తులకు అనుకూలంగా ఫోన్‌ కాల్‌ వచ్చేదని, యోగీ హయాంలో నేరస్తులను వారి వారి స్థానాల్లో ఉంచామన్నారు. మహిళలు ఇకపై ఇళ్లకే పరిమితం కావాలని కోరుకోవడం లేదని తెలిపారు. మహిళల కోసం ఏమీ చేయలేని ప్రభుత్వాలను అధికారంలోకి తీసుకురావొద్దని సూచించారు. స్వ ప్రయోజనాల కోసం ఏ పార్టీ పని చేస్తుందో యూపీ మహిళలకు తెలుసు అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement