హైదరాబాద్, ఆంధ్రప్రభ: ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన మరోసారి వాయిదా పడింది. ఈ నెల 13న రాష్ట్రానికి ప్రధాని మోడీ రావాల్సి ఉంది. ఆ మేరకు షెడ్యూల్ కూడా ఖరారైంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం రానున్నట్టు ప్రకటించారు. అయితే అనివార్య కారణాల వల్ల తెలంగాణ పర్యటనను ప్రధాని మరోసారి వాయిదా వేసుకున్నారు. వాస్తవానికి గత నెలలోనే వందేభారత్ రైలు ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ తెలంగాణకు రావాల్సి ఉంది. అయితే అప్పుడు కూడా పర్యటనను ప్రధాని వాయిదా వేసుకున్నారు. వందేభారత్ రైలును వర్చువల్‌గా ప్రారంభించారు. తాజాగా ఈ నెల 13నాటి తెలంగాణ పర్యటన కూడా వాయిదా పడింది.
11న అమిత్ షా రాక..
రానున్న అసెంబ్లి, సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో గెలుపే లక్ష్యంగా ఎన్నికల యాక్షన్ ప్లాన్ అమలును బీజేపీ జాతీయ నాయకత్వం షురూ చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో బీజేపీ అగ్రనేతలు వరుస పర్యటనలు జరపున్నారు. ఈ నెలలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటన ఖరారైంది. ఈ నెల 11న అమిత్ షా రాష్ట్ర పర్యటనకు రానుండగా, లోక్‌సభ ప్రవాస్ యోజన కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఆదిలాబాద్, పెద్దపల్లి ఎంపీ సెగ్మెంట్లు లేదా మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు పార్లమెంట్ స్థానాల్లో అమిత్ షా పర్యటన ఉండనుంది. పార్లమెంట్ స్థానాలతో సంబంధం లేకుండా ఏదైనా ఒక శక్తి కేంద్రంలోని కార్యకర్తలతో అమిత్ షా భేటీ కానున్నారు. సంస్థాగతంగా పార్టీ ఎంతమేరకు బలోపేతమైందనే విషయాలను స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు. వాస్తవానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా టూర్ గత నెల 28, 29వ తేదీనే ఉండాల్సి ఉంది. కానీ పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఆయన టూర్ వాయిదా వేసుకున్నారు. ఎట్టకేలకు ఈ నెల 11న ఆయన తెలంగాణ పర్యటన ఖరారైంది.
ఈ నెలాఖరున జేపీ నడ్డా…
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఈ నెలాఖరును తెలంగాణ పర్యటనకు రానున్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. జేపీ నడ్డా పర్యటించే నియోజకవర్గాలు త్వరలోనే ఖరారు కానున్నాయని తెలిపారు. రాష్ట్ర పర్యటన సందర్భంగా తెలంగాణ పార్టీ కార్యవర్గంతోనూ నడ్డా భేటీ అవుతారు. ఎన్నికలను ఎదుర్కొనేందుకు అనుసరిస్తున్న వ్యూహాలపై చర్చించనున్నారు.