బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కీలక ప్రకటన చేశారు. బ్యాంకులకు రుణాలను ఎగ్గొట్టి, విదేశాలకు పారిపోయిన.. నీరవ్ మోదీ, విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. వారిని కచ్చితంగా భారత్‌కు పంపిస్తామని హామీ ఇచ్చారు. భారత పర్యటనలో భాగంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రెండో రోజు ప్రధాని మోదీతో ఇవ్వాల భేటీ అయ్యారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత విలేకరులతో మాట్లాడారు. అయితే ఇలా అప్పగించేందుకు కొన్ని చట్టాలున్నాయని గుర్తు చేశారు.
చట్టాలను ఎగవేసి, మా దేశానికి వచ్చేవారిని ఎంత మాత్రమూ ఉపేక్షించమని, అలాంటి వారిని స్వాగతించమని కూడా స్పష్టం చేశారు. భారత చట్టాల నుంచి తప్పించుకొని, తమ దేశ చట్టాలను వాడుకోవాలని చూసే వారిపై తాము కఠినంగా ఉంటామని ఆయన పేర్కొన్నారు. అలాగే బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తున్న ఖలిస్తానీ గ్రూపులపై కూడా ఆయన స్పందించారు. వారి విషయంలో యాంటీ టెర్రరిస్ట్ టాస్క్ ఫోర్స్‌ను నియమించామని, అతి తొందర్లోనే వారిపై కూడా తగు చర్యలు తీసుకుంటామని జాన్సన్ ప్రకటించారు.