హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్‌లోని బోయిగూడలో ఇవ్వాల జరిగిన అగ్ని ప్రమాద ఘనటపై ప్రధాని నరేంద్రమోడీ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘోర అగ్నిప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసిన ప్రధాని పీఎఎన్‌ఆర్‌ఎఫ్ నిధినుంచి ఒక్కొక్కరికి రూ. లక్ష పరిహారం ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రధాని కార్యాలయం సంతాప ప్రకటనను విడుదల చేసింది. హైదరాబాద్ బోయిగూడలో జరిగిన ఘోర అడగ్ని ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం బాధాకరమని, ఈ దు:ఖ సమయంలో నేను మీతోనే ఉన్నాను. ఆపద కాలంలో నా ఆలోచనలు మీచుట్టే ఉన్నాయని ప్రధాని మోడీ ట్విట్టర్‌లో బాధిత కుటుంబాలకు భరోసానిచ్చారు.
సీఎం కేసీఆర్ దిగ్బ్రాంతి…రూ. 5లక్షల చొప్పున పరిహారం
సికింద్రాబాద్ బోయిగూడ స్క్రాప్ గోడౌన్‌లో జరిగిన అగ్నిప్రమాదం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదంలో బీహార్ కార్మికులు మరణించడంపట్ల ఆయన సంతాపం తెలిపారు. ఈ ప్రమాదంలో మరణించిన వారికి ఒక్కొక్కరికి రూ. 5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియోను సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రమాదంలో మృతిచెందిన బీహార్ వలస కార్మికుల పార్ధీవ దేహాలను వారివారి స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేష్‌కుమార్‌ను ఆదేశించారు.
గవర్నర్ తమళిసై సంతాపం…
ఈ రోజు సికింద్రాబాద్ బోయిగూడలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో పలువురు బీహార్ కార్మికులు తమ అమూల్యమైన ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం అని గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనపై రాజ్‌భవన్ అధికారులతో మాట్లాడిన గవర్నర్ తీవ్ర విచారం వ్యక్తం చేసి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్ధించారు.
ప్రమాద స్థలికి సీఎస్ సోమేష్…
సికింద్రాబాద్ బోయిగూడలో అగ్నిప్రమాదం జరిగిన స్క్రాప్ గోడౌన్ ప్రాంతానికి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ హుటాహుటిన చేరుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో జరుగుతున్న సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు. అగ్నిమాపక, జీహెచ్‌ఎంసీ, ఈవీడిఎం బృందాలు చేపడుతున్న అగ్నిమాపక నివారణ చర్యలను పరిశీఇలంచారు. ఈ ప్రమాదం జరిగిన నేపథ్యాన్ని పోలీసు, అగ్నిమాపక అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సంఘటన జరగడం అత్యంత విచారకరమని, ఇటువంటి ఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. మృతదేహాలను ప్రభుత్వమే వారివారి స్వస్థలాలకు పంపిస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆయన అక్కడినుంచి నేరుగా గాంధీ ఆస్పత్రికి చేరుకొని మార్చురిలో ఉన్న మృతదేహాలను పరిశీలించారు. గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో మాట్లాడి వెంటనే పోస్టు మార్టం నిర్వహించాలని ఆదేశించారు. గుర్తుపట్టకుండా ఉన్న మృతదేహాలను డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి గుర్తించాలన్నారు. ఈ ప్రమాద సంఘటనలో గాయాలతో బైటపడిన వ్యక్తికి అత్యంత మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని వైద్యులను ఆదేశించారు.
సత్వరమే స్పందించిన తెలంగాణ ప్రభుత్వం…
బోయిగూడ స్క్రాప్ గోడౌన్ ఘోర అగ్నిప్రమాదంలో 11 మంది బీహార్ కార్మికులు సజీవ దహనమైన దారుణ ఘనటపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీస్, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. సహాయక చర్యల్లో పాల్గొని మంటలను అదుపుచేసి క్షతగాత్రులను రక్షించేందుకు కృషి చేశారు. ప్రమాదంలో 11 మంది మృతిచెందారని తెలుసుకున్న వెంటనే సీఎం కేసీఆర్ ఒక్కో కుటుంబానికి రూ. 5లక్షల పరిహారం ప్రకటించారు. వారిని గుర్తించేందుకు, ప్రమాద ప్రాంతంలో సహాయ చర్యలకు సీఎస్ సోమేష్‌కుమార్‌తోపాటు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌లను వెళ్లాలని ఆదేశించారు. మృతదేహాలను వారివారి స్వస్థలాలకు పంపించేందుకు ప్రభుత్వమే చొరవ తీసుకుంది. ఇందుకు రెండు ప్రత్యేక విమానాల్లో బుధవారం 6 మృతదేహాలను, గురువారంనాడు మరో 5 మృతదేహాలను తరలించాలని నిర్ణయించింది.