Monday, November 18, 2024

మోడీ ప్రధాని కాదు, సేల్స్‌మ‌న్‌.. కొంత మంది షావుకారు దోస్తుల కోసం పనిచేస్తున్నారు: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ప్రధాని మోడీ పాలనలో అంతా తిరోగమనమేనని సీఎం కేసీఆర్‌ విమర్శించారు. విపక్షాల రాష్ట్రపతి యశ్వంత్‌ సిన్హాకు మద్దతుగా హైదరాబాద్‌లోని జలవిహార్‌లో సీఎం అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడారు. మోడీ ప్రధానిగా కాకుండా దేశానికి సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల కోసం కాకుండా కొంత మంది తన దోస్తులైన షావుకార్ల కోసం ప్రధాని పనిచేస్తున్నారని మండిపడ్డారు. మోడీ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరన్నారు. మోడీ తీరుతో శ్రీలంకలో ప్రజలు నిరసనలు తెలిపారని గుర్తు చేశారు. శ్రీలంక చేసిన ఆరోపణలపై ప్రధాని మౌనమెందుకు వహిస్తున్నారని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. శ్రీలంక విషయంలో స్పందించకుంటే ప్రధానిని దోషిగానే చూడాల్సి వస్తుందన్నారు. మోడీకి ముందు ఎందరో ప్రధానులుగా పనిచేశారన్నారు.

మోడీ శాశ్వతం కాదన్నారు. దేశ రాజకీయాల్లో మార్పు తథ్యమని చెప్పారు. మోడీ ఎనిమిదేళ్ల పాలనలో ద్రవ్యోల్బనం పెరిగిపోయిందని, సామాన్యుడు బతుకలేని పరిస్థితి నెలకొందని సీఎం కేసీఆర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. వికాసం పేరుతో దేశాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. ప్రధాని మోడీ అవినీతి రహితభారత్‌ అని పెద్దపెద్ద మాటలు చెప్పారని ఎంత నల్లధనం వెనక్కి తీసుకువచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. మోడీ పాలనలో అవినీతి పరులు పెరిగిపోయారన్నారు. నల్లధనం నియంత్రణ కావడం పక్కనపెట్టి రెట్టింపయిందని విమర్శించారు. ఇదేనా వికాసం అని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. మోడీ ప్రధానిగా కాదు దోస్త్‌ కోసం షావుకార్‌గా పనిచేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ వ్యవస్థలను మోడీ దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో రైతులు, సైనికులు, నిరుద్యోగులు, ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని సీఎం కేసీఆర్‌ తెలిపారు. రైతు చట్టాలు రద్దు చేయమని పోరాడిన వందల మంది రైతులను ప్రధాని పొట్టనపెట్టుకున్నారన్నారు.

రైతు పోరాటంలో చనిపోయిన వారికి తాము పంజాబ్‌ వెళ్లి పరిహారమిస్తే చులకన చేసి మాట్లాడరన్నారు. కరోనా సమయంలో ఒక్కసారిగా లాక్‌డౌన్‌ ప్రకటించి పేద ప్రజల బతుకులు చిధ్రం చేశారన్నారు. తాము స్వయంగా రైళ్లు ఉచితంగా పెట్టి ఎంతో మంది ఇతర రాష్ట్రాల వారిని స్వస్థలాలకు పంపించామన్నారు. గంగానదిలో శవాలు తేలేలా చేసిన ఘనత మోడీదని కేసీఆర్‌ మండిపడ్డారు. మోడీ పనితీరుతో అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్ట దిగజారుతోందన్నారు. దేశంలో సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నప్పటికీ విదేశాల నుంచి బొగ్గు కొని దిగుమతి చేసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం హుకుం జారీ చేస్తోందని సీఎం మండిపడ్డారు. మోడీపై జనంలో ఆగ్రహం పెరుగుతోందని తెలిపారు. మోడీ ఎన్నికలపుడు తియ్యని మాటలు చెబుతారని, తర్వాత అబద్ధాలు చెబుతారని ఎద్దేవా చేశారు. రైతు చట్టాలు సరైనవే అయితే వాటిని ఎందుకు వెనక్కి తీసుకున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో ప్రధాని దేశం ముందు తలదించుకున్నారని సీఎం గుర్తు చేశారు.

మోడీని చూసి పెద్ద పెద్ద పరిశ్రమలు దేశం నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకుని పారిపోతున్నాయన్నారు. ఎనిమిదేళ్లలో దేశంలో భారీ స్కాంలు జరిగాయన్నారు. రూపాయి పతనం చూస్తే మోడీ పాలన ఎలా ఉందో అర్ధమవుతుందన్నారు. మేక్‌ ఇన్‌ ఇండియా శుద్ధ అబద్ధమన్నారు. మోడీతో తనకు వ్యక్తిగత విభేదాలు ఏవీ లేవన్నారు. మోడీ విధానాలపైనే తన అభ్యంతరాలన్నారు. తాము మౌనంగా ఉండబోమని, పోరాటం చేస్తామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో విజయవంతంగా యశ్వంత్‌ సిన్హా స్వాగతానికి, సభకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేసిన హైదరాబాద్‌ టీఆర్‌ఎస్‌ నాయకులు, మంత్రులను సీఎం ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, టీఆర్‌ఎస్‌ లోక్‌సభ పక్షనేత నామానాగేశ్వర్‌రావు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాష్ట్ర కమిటీ ప్రతినిధులు, యశ్వంత్‌ సిన్హాతో పాటు వచ్చిన మాజీ ఎంపీ సువేంద్ర కులకర్ణి తదితరులు పాల్గొన్నారు.

మహారాష్ట్ర తరహాలో చేస్తామంటున్నారు… మంచిదే… తెలంగాణలో కేంద్ర మంత్రిగా ఉన్న ఒకాయన మహారాష్ట్ర తరహా రాజకీయం త్వరలో తెలంగాణలో జరుగుతుందని హెచ్చరిస్తున్నారని కేసీఆర్‌ చెప్పారు. అలా అయితే తమకే మంచిదని, కావల్సినంత సమయం దొరకుతుందన్నారు. ఇక అప్పుడు ఢిల్లిd గద్దె మీద నుంచి బీజేపీ ప్రభుత్వాన్ని దించడమే తమ పనిగా పెట్టుకుంటామని హెచ్చరించారు.

- Advertisement -

ప్రధానికి సీఎం కేసీఆర్‌ ప్రశ్నలు…
రెండు రోజుల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్‌ వచ్చిన ప్రధాని మోడీ తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సీఎం కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు.

మీరు 2014లో తొలిసారి ప్రధానిగా ఎన్నికయ్యే ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా…టార్చిలైట్‌ వేసి వెతికినా మీ హామీలు నెరవేరినట్లు కనిపించవన్నారు.

వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చులు ఎందుకు పెంచారో చెప్పాలన్నారు.

నిత్యావసర వస్తువులు ఎందుకు పెరిగాయో చెప్పాలన్నారు.

ప్రభుత్వ వ్యవస్థలు మీ పాలనలో ఎందుకు దుర్వినియోగమవుతున్నాయని ప్రశ్నించారు.

వ్యవసాయ చట్టాలు ఉపసంహరించుకున్నపుడు
రైతులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయన్నారు.

మీ పాలనలో రైతులు, సైనికులు, నిరుద్యోగులు, ఉద్యోగులు ఎందుకు ఇబ్బందిపడుతున్నారో చెప్పాలన్నారు.

శ్రీలంక చేసిన ఆరోపణలపై స్పందించకుండా ప్రధాని ఎందుకు మౌనం వహిస్తున్నారో చెప్పాలని నిలదీశారు.

మీ పాలనలో రూపాయి అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు.

నల్లధనం ఎంత వెనక్కి తీసుకువచ్చారో చెప్పాలన్నారు. ఒక్కొక్కరి ఖాతాలో రూ.15లక్షలు ఎందుకు వేయలేదో చెప్పాలన్నారు

అవినీతి రహిత భారత్‌ అని పెద్ద పెద్ద మాటలు చెప్పారని, అయినా అవినీతీ ఎందుకు పెరిగిందో చెప్పాలన్నారు.

ఫోర్డ్‌, హార్లీ డేవిడ్‌ సన్‌ తదితర కంపెనీలు దేశం నుంచి ఎందుకు
వెళ్లిపోయాయో చెప్పాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement