Tuesday, November 26, 2024

అన్నిరంగాల్లో మోదీ ప్రభుత్వం అట్టర్‌ ప్లాఫ్‌.. ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాల్సిందే: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : జాతీయ రాజకీయాల్లో చాలా శూన్యత ఉందని , అందుకే తాను జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు నిర్ణయం తీసుకున్నానని సీఎం కేసీఆర్‌ చెప్పారు. దేశంలో కొత్త జాతీయపార్టీ ఆవిర్భవించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అందుకే ప్రశాంత్‌ కిషోర్‌తో కలిసి పనిచేస్తున్నానని చెప్పారు. ప్రశాంత్‌ కిషోర్‌తో కలిసి పనిచేయటం తప్పేలా అవుతుందని ప్రశ్నించారు. దేశంలో పరివర్తన కోసం పనిచేస్తున్నానని ఉద్ఘాటించారు. వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లిd బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్నాయని, కొన్ని రాష్ట్రాల్లో అయిపోయాయని, ఇవన్నీ అయ్యాక ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల ముఖ్యులతో సమావేశమై జాతీయ స్థాయిలో తాజా రాజకీయ పరిస్థితులను చర్చించటంతోపాటు కొత్త కూటమి ఏర్పాటుపై అడుగులు వేస్తామన్నారు.

తాము ఏర్పాటు చేసేది కూటమినా..?, పార్టీయా..?, ఫ్రంటా..? , వేదికా..? అనేది ఇప్పటికప్పుడు చెప్పలేనని, అయితే 2024లో మాత్రం సంపూర్ణ క్రాంతి వైపుగా దేశం వెళ్తుందని స్పష్టం చేశారు. జాతీయ రాజకీయాలపై తాను రోజు నాలుగు గంటలపాటు పనిచేస్తున్నానని చెప్పారు. దేశంలో 1018 విశ్వ విద్యాలయాలు ఉన్నాయని, 65వేల డిగ్రీ, వృత్తి విద్యా కాలేజీలు పనిచేస్తున్నాయని, 20లక్షల మంది న్యాయవాదులున్నారని, వీరందరినీ ఒకతాటిపైకి తెచ్చి జాతీయస్థాయిలో మార్పు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నానని ఆయన చెప్పారు. దేశం బాగుపడాలంటే నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందేనన్నారు. యూపీఏ పాలన ఆశించినంతగా లేకపోవటంతోనే ప్రజలు ఆ కూటమిని తిరస్కరించి బాజాపా నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి అధికారాన్ని కట్టబెట్టారని, ఈ కూటమి యూపీఏకన్నా అధ్వానంగా పాలనసాగిస్తోందని విరుచుకుపడ్డారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తానని తాను గతంలో చెప్పినదానికి కట్టుబడి ఉన్నానని, ఈ దిశగా తన ప్రయాణం సాగుతుందని చెప్పారు.

ఏ రంగంలో చూసినా తిరోగమనమే…బీజేపీని ఇంటికి పంపాల్సిందే
ఏరంగంలో చూసినా ఈ దేశం తిరోగమనం వైపే పయనిస్తోందని, ఇందుకు కారణం బీజేపీ ప్రభుత్వ విధానాలేనని కేసీఆర్‌ పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని తిరిగి ఇంటికి పంపాల్సిందేనని , ప్రగతిశీల విధానంలో పనిచేసే ప్రభుత్వం రావాల్సిందేనని ఆయన అన్నారు. దిస్‌ గవర్నమెంట్‌ మస్ట్‌ గో… అంటూ మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దేశంలో అభివృద్ధి కానరావటం లేదని, తలసరి ఆదాయం అంతంత మాత్రంగానే ఉందని, ఆర్థికాభివృద్ధి లేనేలేదని అన్నారు. భయంకరమైన ఇండెక్స్‌ కనిపిస్తున్నాయని , నిరుద్యోగం, యువత ఇండెక్స్‌ లో చివరి స్థానంలో ఉన్నామని చెప్పారు. సిరియా కంటే మనదేశం అధ్వాన పరిస్థితిలో ఉందని, అభివృద్ధి, ఉపాధికల్పనా రంగాల్లో ఎంతో వెనుకబడిపోయామని చెప్పారు.

బాజాపా ప్రభుత్వ దుర్మార్గ విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజలను చైతన్యవంతం చేయాలని ఇందుకు ఉద్యమాన్ని నిర్మిస్తామని హెచ్చరించారు. 2కోట్ల ఉద్యోగాలను ఇస్తామన్న మోదీ ప్రభుత్వం కేంద్రంలో ఖాళీగా ఉన్న 15లక్షల ఉద్యోగాలను భర్తీ చేయటం లేదని, ఇందుకు వ్యతిరేకంగా తాము ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఎస్సీవర్గీకరణను చేపట్టాలని శాసనసభలో తీర్మాణించి కేంద్రానికి పంపించినా ఫలితం లేకపోయిందని చెప్పారు. ఈ అంశంపై కూడా పోరాడుతామని హెచ్చరించారు. ప్రజలను విడదీసి, ఉద్వేగాలకు లోనుచేసి వారిని రాజకీయంగా ఉపయోగించుకునే దుర్మార్గం దేశంలో నెలకొని ఉందని చెప్పారు. ఇలా చేయటం వల్ల దేశ అభివృద్ధి కుంటుపడుతుందని, అందుకే ప్రగతిశీల విధానంలో పనిచేసే ప్రభుత్వం కేంద్రంలో రావాల్సిన అవసరం ఉందని చెప్పారు.

కశ్మీర్‌ ఫైల్స్‌ ఏంటో … దిక్కుమాలిన వ్యవహారం
కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమా ద్వారా సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా..? అని కేసీఆర్‌ ప్రశ్నించారు. సామాజిక మాద్యమాల ద్వారా విష ప్రచారానికి తెరతీసి, ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు ఉపయోగపడే సినిమాలు తీయాలికాని ఇలాంటి విభజన రాజకీయాలు తగవని హితవు పలికారు.
పురోగమిస్తున్న దేశంలో ఇరిగేషన్‌ ఫైల్స్‌, ఎకనామిక్‌ ఫైల్స్‌, ఇండస్ట్రియల్‌ ఫైల్స్‌ లాంటి సినిమాల ద్వారా ప్రజలకు ఏమైనా ఉపయోగం జరుగుతుంది కాని, ఈ కశ్మీర్‌ ఫైల్స్‌ ఎంటో, ఈ దిక్కుమాలిన వ్యవహారం ఏంటో తనకు అర్థం కావటం లేదని, ఈ సినిమాతో ఎవరికి లాభం అని ప్రశ్నించారు. దేశాన్ని విభజించి ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలు జరుగుతున్నాయని, ఇలాంటి వాటిని తెలంగాణ ప్రజానికం సహించదన్నారు.

- Advertisement -

కశ్మీర్‌ ఫైల్స్‌ నినాదాన్ని బాజాపా లేవనెత్తి ఓట్ల రూపంలో లబ్దిపొందేందుకు ప్రయత్నిస్తోందని కేసీఆర్‌ ఆరోపించారు. ఢిల్లిdలో కశ్మీర్‌ పండింట్లకు న్యాయం చేయకుండా మాటలు చెబుతూ, దేశ, ప్రజలను విభజించి విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె అన్నామే తప్ప… హిందూ, ముస్లిం, క్రిస్టియన్‌, సిక్కుల సమ్మె అనలేదని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. బాజాపా పాలిత రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ఉద్యోగులకు సెలవులు ఇచ్చి మరీ కశ్మీర్‌ ఫైల్స్‌ చూడమంటున్నారని ఆరోపించారు. దుష్ప్రచారాలు, విభజన రాజకీయాలతో జరిగే పరిణామాలకు ఎవరు బాద్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు.

నోటిఫికేషన్లకు సమయం పడుతుంది
ఉద్యోగ నోటిఫికేషన్లకు సమయం పడుతుందని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. నోటిఫికేషన్లు ఎలా పడితే అలా ఇస్తే న్యాయపరమైన చిక్కులు తలెత్తుతాయని చెప్పారు. 80వేల ఉద్యోగాలు కచ్చితంగా భర్తీ చేసి తీరుతామని, దీనిపై ఎలాంటి ఆందోళన వద్దని స్పష్టం చేశారు. ఇక నుంచి ఏటా ఉద్యోగ క్యాలెండర్‌ విడుదల చేసి పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. పాఠశాలలను మూసివేస్తామని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని, ఇది ముమ్మాటికీ సత్యదూరమని చెప్పారు. రాష్ట్రంలో పాఠశాలలను మూసివేయాల్సిన అవసరం లేదని, పాఠశాలల్లో అవసరం మేరకు బోధనా సిబ్బంది ఉండాలన్నారు. ఈ మేరకు తాను ఇప్పటికే విద్యాశాఖా మంత్రికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాని గుర్తు చేశారు. ప్రతి పాఠశాలలో సబ్జెక్టు చెప్పే టీచర్ల నియామకం చేయాలని కోరినట్లు చెప్పారు. అన్ని సబ్జెక్టుల్లో బోధనకు అవసరమైతే మరో 10వేల టీచర్‌ పోస్టులను భర్తీ చేస్తామని ఆయన చెప్పారు. ఇంగ్లీష్‌ మీడియం మాద్యమాన్ని రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ప్రవేశపెడుతున్నామని ఈ లోపు ఉపాధ్యాయుల రేషనలైజేషన్‌ పూర్తి చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement