Thursday, November 21, 2024

ఇవిగో… 71,506 మంది ఉద్యోగ ప‌త్రాలు – న‌రేంద్ర‌మోడీ

న్యూఢిల్లి: అభివృద్ధి చెందిన భారత్‌ సాధన కోసం చేసుకున్న తీర్మానాల సాకారం దిశగా ప్రతిభను సంతరించుకున్న శక్తిమంతమైన యువతకు సరైన అవకాశాల కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. జాతీయ ఉద్యోగ మేళాలో భాగంగా వేర్వేరు ప్రభుత్వ విభాగాలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన 71,506 మందికి ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నియామకపత్రాలను పొందిన వారిని, వారి కుటుంబాలను ప్రధాని అభినందించారు. ఒక నివేదిక ప్రకారం దేశంలో స్టార్టప్‌లు 40 లక్షలకు పైగా ప్రత్యక్ష లేదా పరోక్ష ఉద్యోగాలను సృష్టించాయని ప్రధాని తెలిపారు. ఉపాధికి కొత్త వేదికలుగా డ్రోన్లు, క్రీడా రంగాన్ని ఆయన ప్రస్తావించారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ అనే పథకం గ్రామాల నుంచి నగరాల వరకు కోట్లాదిగా ఉపాధి అవకాశాలను సృష్టిస్తోందని తెలిపారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అధునాతన శాటిలైట్లు, సెమీ హై స్పీడ్‌ రైళ్ళను గురించి ప్రస్తావిస్తూ గడచిన తొమ్మిదేళ్ళలో భారత్‌లో 30,000కు పైగా ఎల్‌హెచ్‌బీ బోగీలు తయారయ్యాయని, ఈ బోగీలకు అవసరమైన సాంకేతికత భారత్‌లో వేలాదిగా ఉద్యోగాలను సృష్టించాయని తెలిపారు.

భారత్‌లో సంపూర్ణంగా రూపాంతరం చెందిన బొమ్మల తయారీ పరిశ్రమ కూడా అత్యధిక సంఖ్యలో ఉపాధి అవకాశాల కల్పనలో ఒక ముఖ్యమైన భూమికను పోషిస్తోందని మోడీ చెప్పారు. భారత్‌లో రక్షణ యంత్ర సామాగ్రిని విదేశాల నుంచి మాత్రమే దిగుమతి చేసుకోవాలనే భావజాలానికి దీటుగా విశ్వసనీయమైన దేశవాళీ తయారీదారులను ప్రభుత్వం సంప్రదించిందని, భారత్‌లో తయారైన రూ.15,000 కోట్ల విలువైన రక్షణ సామాగ్రి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవుతోందని ప్రధాని చెప్పారు. నియామక పత్రాలను అందుకున్న వారిని ఉద్దేశించి మాట్లాడుతూ 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్‌ లక్ష్యంగా యావత్‌ జాతి ముందుకు సాగుతున్న తరుణంలో దేశాభివృద్ధిలో మీ వంతు పాత్ర పోషించడానికి మీకిదే సరైన అవకాశమని మోడీ అన్నారు. ”నేడు మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ ప్రయాణంలో ఒక సామాన్యు పౌరుడిగా మీరు భావించే విషయాలను నిత్యం గుర్తుంచుకోవాలి” అని ప్రధాని తెలిపారు. నియమాక పత్రా లతో ప్రభుత్వం నుంచి ఆశించినవి పొందిన మీరు.. ఇకపై ఇతరుల ఆశలను నెరవేర్చే బాధ్యత మీదే అని ఆయన అన్నారు. ”మీలో ప్రతి ఒక్కరూ మీ పని ద్వారా ఏదో ఒక మార్గంలో ఒక సామాన్యుడి జీవితాన్ని ప్రభావితం చేస్తారు” అని ప్రధాని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement