వినాయకచవితి..ఓనమ్.. నౌఖాయ్, సంవత్సరి పర్వ పండుగల సందర్భంగా దేశ ప్రజలు అందరికీ ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 29న మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని (జాతీయ క్రీడా దినం) గుర్తు చేశారు. అంతర్జాతీయ పోటీల్లో భారత ఖ్యాతిని విస్తరిస్తున్న క్రీడాకారులకు శుభాకాంక్షలు చెప్పారు. ప్రధాని 92వ మన్ కీ బాత్ కార్యక్రమం ఆదివారం దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో, ఆల్ ఇండియా రేడియో వెబ్ సైట్ లో ప్రసారమైంది. 2014 అక్టోబర్ 3న మన్ కీ బాత్ ను ప్రధాని ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి నెలా చివరి ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నారు. 2023 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించింది. భారత్ తీసుకొచ్చిన ఈ ప్రతిపాదనకు 70 దేశాలు మద్దతు తెలిపాయి. నేడు మిల్లెట్స్ ను సూపర్ ఫుడ్ గా చెబుతున్నారు. వీటిని దేశంలో ప్రోత్సహించేందుకు ఎంతో చేస్తున్నాం.
పరిశోధన, ఆవిష్కరణలకు తోడు ఉత్పత్తి పెంచేందుకు మద్దతు చర్యలు తీసుకుంటున్నాం. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద మిల్లెట్స్ (సిరి ధాన్యాలు) తయారీదారుగా ఉంది. దీన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత భారతీయులపై ఉంది.
జల్ జీవన్ మిషన్ దేశంలో పోషకాహార లోపం నివారణకు మంచి ఫలితాలను ఇస్తోంది. ఇందులో మీరు కూడా పాలుపంచుకోవాలి. అసోంలోని బోంగాయ్ గ్రామంలో ఒక ఆసక్తికర ప్రాజెక్టు నడుస్తోంది. దాని పేరు సంపూర్ణ. దీని లక్ష్యం పోషకాహార లోపాన్ని తరిమి కొట్టడమే. ఈ ప్రాజెక్టు వల్ల ఏడాదిలోనే అక్కడ 90 శాతం పోషకాల లేమిని నివారించడం సాధ్యపడింది. ప్రధాని తన ప్రసంగంలో నీటి సంరక్షణ అవసరాన్ని, ప్రాధాన్యతను తెలియజేశారు. అలాగే డిజిటల్ ఇండియా కార్యక్రమం ఇస్తున్న ఫలితాలను ప్రస్తావించారు. హిమాలయ ప్రాంతాల్లో పండే ఫిగ్, అక బేదు పండ్లను ప్రస్తావించారు. వీటిల్లో ఎన్నో మినరల్స్, విటమిన్స్ ఉన్నాయంటూ, వీటిని రైతులు ఇప్పుడు ఆన్ లైన్ లో విక్రయిస్తూ మంచి రాబడి పొందుతున్నట్టు చెప్పారు