బాహ్య సౌందర్యం వేరు, అంతః సౌందర్యం వేరన్న సంగతి తెలిసిందే. అలాగే అందం ఒక్కటే ముఖ్యం కాదు ఈ ప్రపంచంలో. అంగవైకల్యంతో కూడా ఎన్నో సాధించవచ్చని ఇప్పటికే ఎంతో మంది రుజువుచేశారు. కాగా అంగవైకల్యం శరీరానికే , మనసుకి కాదంటోంది కేరళకి చెందిన దివ్యాంగ మోడల్. మోడలింగ్ అంటేనే గ్లామర్ తో కూడుకున్న విషయం. మరి అంగవైకల్యం ఉన్న ఆమె మోడల్ గా ఎలా రాణించారో తెలుసుకుందాం.. మోడలింగ్ అనే విభిన్న రంగాన్ని ఎంచుకొని దివ్యాంగులకు ఆదర్శంగా నిలుస్తున్నారు పాతు ఫాతిమా , రెమ్యా గణేశ్. కేరళకు చెందిన ఫాతిమా పుట్టుకతో దివ్యాంగురాలు కాదు. ఇప్పుడు ఆమె వయసు 20 ఏండ్లు. అంతుచిక్కని వ్యాధి ఆమె కాలును తొలిచివేసింది.
17 సంవత్సరాలు ఉన్నప్పుడే శస్త్రచికిత్స చేసి ఆమె కుడికాలును తొలగించారు. అయినా ఆమె కుంగిపోలేదు. కృత్రిమ కాలు అమర్చుకొని పట్టుదలతో అడుగులు వేసింది. తన ఆశలకు రెక్కలు తొడిగింది. సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తూ తన ప్రతిభను నిరూపించుకుంది. వీటితోపాటు ఫొటోషూట్లు చేస్తూ, మోడలింగ్‌లో సత్తా చాటుతుంది. కృత్రిమ కాలుతోనే ఎన్నో ర్యాంప్ షోల్లో క్యాట్‌వాక్ చేసి హ్యాట్సాఫ్ అనిపించుకుంది. ఇంటర్నేషనల్ ఫ్యాషన్‌వీక్ గోవాలో నిర్వహించిన పోటీలో 2021 ఆసియా ఫ్యాషన్ అవార్డును కైవసం చేసుకుంది ఫాతిమా. 2019 నుంచి ఇప్పటికి 20కిపైగా ఫొటోషూట్లు చేసింది.
కోజికోడ్‌కు చెందిన 32 ఏండ్ల రెమ్యా గణేశ్‌కు తొమ్మిది నెలల పసిపిల్లగా ఉన్నప్పుడు పోలియో టీకా వికటించి కాళ్లు చచ్చుబడిపోయాయి. ఆమె బాల్యమంతా భారంగానే గడిచింది. 14వ ఏట పదో తరగతిలో ఉండగా తండ్రి చనిపోవడంతో చదువూ ఆగిపోయింది. తర్వాత కొన్నాళ్లకు ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన కంప్యూటర్, వ్యక్తిత్వ వికాస కోర్సులకు హాజరై తన జీవితాన్ని తిరిగి ప్రారంభించింది రెమ్యా. సాక్షరత మిషన్ ద్వారా చదువుకొని మంచి గ్రేడ్‌తో పది పాసైంది. ప్రస్తుతం కోజికోడ్‌లోని మలబార్ క్రిస్టియన్ కాలేజ్‌లో డిగ్రీ చదువుతూ.. మోడల్‌గా రాణిస్తుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..