రానున్న మూడు సంవత్సరాల్లో పెద్ద పెద్ద బహుళజాతి కంపెనీలు (ఎంఎన్‌సీలు) 50 శాతం కార్యాలయాలను తగ్గించుకోవాలని భావిస్తున్నాయి. కోవిడ్ తరువాత వర్క్ ఫ్రమ్ హోంతో ఉద్యోగులు ఇంటి నుంచే పని చేశారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల మూలంగా ఈ విధానాన్నే మరికొంత కాలం కొనసాగించాలని ఎంఎన్‌సీలు భావిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 350 కంపెనీల రియల్ ఎస్టేట్ డిపార్ట్‌మెంట్ ఇన్‌ఛార్జీ ఎగ్జిక్యూటీవ్‌లను నైట్ ఫ్రాంక్ ఈ విషయంపై సర్వే నిర్వహించింది. ఉద్యోగుల సంఖ్యను భారీగా తగ్గించుకుంటున్న కంపెనీలు ఆఫీస్ స్పేస్‌ను కూడా 10-20 శాతం తగ్గించుకోవాలని భావిస్తున్నాయి. పెద్ద సంస్థలు కూడా తక్కువ ఆఫీస్ స్పేస్‌ను కోరుకుంటున్నాయని నైట్ ఫ్రాంక్‌కు చెందిన కమర్షియల్ రియల్ ఎస్టేట్ నిపుణుడు లీ ఇలియట్ చెప్పారు.
కంపెనీలు కార్యాలయాలను తగ్గించుకోవాలని నిర్ణయించడం వల్ల పాత భవనాలు, ఎక్కువగా ప్రాధాన్యతలేని ప్రాంతాల్లోఉన్న భవనాల పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నందున భవనాల యాజమాన్యాలు రెంట్ తక్కువకు ఇచ్చే పరిస్థితులు లేవని చెప్పారు. ఇది వారికి ఇబ్బందికర పరిస్థితిని సృష్టిస్తుందన్నారు. కార్యాలయాల సైజ్‌ను తగ్గించుకోవాలనుకునే కంపెనీలు ఈ మార్పులు చేసేందుకు లీజు గడువు ముగిసే వరకు వేచి చూడాల్సి ఉంటుందని ఇలియట్ తెలిపారు.
పని విధానంపై కంపెనీలు రకరకాల విధానాలను అనుసరిస్తున్నాయి. ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ బ్లాక్ రాక్ తన ఉద్యోగులకు వారంలో నాలుగు రోజులు ఆఫీస్ నుంచి పని చేయాలని కోరింది. దీన్ని హైబ్రీడ్ విధానంగా పిలుస్తున్నారు. జేపీ మోర్గాన్ తన ఉద్యోగులకు పూర్తి సమయం కార్యాలయం నుంచే పని చేయాలని కోరింది. ప్రపంచ వ్యాప్తంగా 56 శాతం కంపెనీలు ఉద్యోగులను హైబ్రీడ్ వర్క్ విధానంలో పని చేయాలని కోరుతున్నాయని నైట్ ఫ్రాంక్ తెలిపింది. 10 శాతం కంపెనీ పూర్తిగా వర్క్ ఫ్రం హోం కొనసాగిస్తున్నాయి. శాన్ ప్రాన్సిస్కో, వాషింగ్టన్ వంటి నగరాల్లో చాలా కార్యాలయాలు చాలా వరకు ఖాళీగా ఉన్నాయని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సవిలాస్ తెలిపింది.