హైదరాబాద్ నగర వాసులకు తీపి కబురు. కరోనా కారణంగా నిలిచిపోయిన ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుతున్నది. ప్రజలు సాధారణ జీవనానికి అలవాటు పడుతున్నారు. ఈ క్రమంలో దక్షిణ మధ్యరైల్వే ఎంఎంటీఎస్ సర్వీసులను పెంచింది. ఇటీవల పది రైళ్లను అందుబాటులోకి తీసుకు రాగా.. గురువారం నుంచి మరో 45 సర్వీసులను నడుపనున్నట్లు ప్రకటించింది.
లింగంపల్లి నుంచి హైదరాబాద్, ఫలక్‌నుమా నుంచి లింగంపల్లి/రామచంద్రాపురం మధ్య ఎంఎంటీస్ రైళ్లు పునరుద్ధరించింది. ఫలక్‌నుమా- లింగంపల్లి- రామచంద్రాపురం మార్గంలో 13, లింగంపల్లి- రామచంద్రాపురం-ఫలక్‌నుమా రూట్‌లో 12, హైదరాబాద్- లింగపల్లి రూట్‌లో 10, లింగంపల్లి- హైదరాబాద్ మార్గంలో 10 చొప్పున సర్వీసులు నడుస్తాయని దక్షిణ మధ్యరైల్వే అధికారులు పేర్కొన్నారు. తెల్లవారుజామున 5.40కు తొలి సర్వీసు ప్రారంభం అవుతుంది. రాత్రి 10.45కి చివరి సర్వీసు ఉంటుంది. రాత్రి 11.30కి గమ్యస్థానాలకు చేరుకునేలా ఎంఎంటీఎస్ రైళ్లు నడవనున్నాయి.
కాగా, జంట నగరాల పరిధిలో లక్షలాది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేయడంలో కీలకపాత్ర పోషిస్తున్న ఎంఎంటీఎస్ రైళ్లు గతేడాది కరోనా కారణంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే, ప్రజల డిమాండ్ మేరకు ప్రస్తుతం మొదలైన పది సర్వీసులకు తోడు అదనంగా 45 సర్వీసులు నేటి నుంచి నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది.
ఇది కూడా చదవండి: గర్భిణీలకు కరోనా వ్యాక్సిన్.. మార్గదర్శకాలు ఇవే!