Tuesday, November 26, 2024

కేంద్ర మంత్రి అమిత్ షాపై ఎమ్మెల్సీ కవిత ప్రశ్నల వర్షం

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై చూపుతున్న వివక్షపై సమాధానం చెప్పాలని కేంద్రమంత్రి అమిత్ షాను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. శనివారం తెలంగాణలో పర్యటించనున్నఅమిత్ షాను వివిధ అంశాలపై ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణకు కేంద్రం నుండి రావాల్సిన రూ. 3000 కోట్లకు పైగా ఉన్న ఫైనాన్స్ కమీషన్ గ్రాంట్ల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారని ప్రశ్నించిన ఎమ్మెల్సీ కవిత, బ్యాక్‌వర్డ్ రీజియన్ గ్రాంట్: రూ. 1350 కోట్లు, GST పరిహారం: రూ. 2247 కోట్ల జీఎస్టీ పరిహారం సంగతేమిటి అని ప్రశ్నించారు. గత 8 సంవత్సరాలలో తెలంగాణకు ఒక్క IIT, IIM, IISER, IIIT, NID, మెడికల్ కాలేజీ లేదా నవోదయ పాఠశాలలు ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు విఫలమైందో తెలంగాణ బిడ్డలకు వివరించాలని అమిత్ షాను ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.

మిషన్ కాకతీయ & మిషన్ భగీరథకు రూ.24,000 కోట్ల నిధులు ఇవ్వాలన్న నీతి అయోగ్ సిఫార్సును కేంద్ర ప్రభుత్వం ఎందుకు విస్మరించిందో చెప్పాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. అమిత్ షా జీ, కర్ణాటకలోని ఎగువ భద్ర నీటిపారుదల ప్రాజెక్టుకు, కెన్ బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించి, పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ & కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా నిరాకరించడం కేంద్రప్రభుత్వం కపటత్వం కాదా?  అంటూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. అంతేకాదు బిజెపి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పెరిగిన నిరుద్యోగం మరియు మతపరమైన అల్లర్లపై, భారత్‌ను అత్యంత ఖరీదైన ఇంధనం మరియు LPGని విక్రయించడంలో అగ్రగామి దేశంగా మార్చడంపై, ఆకాశాన్ని తాకుతున్న ద్రవ్యోల్బనంపై మీ సమాధానం ఏమిటని కేంద్ర మంత్రి అమిత్ షాను ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement