Wednesday, November 20, 2024

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. తెలంగాణలోని మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌, వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాలకు, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా-గుంటూరు, ఉభయగోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.

తెలంగాణలో మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌, వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు హైదరాబాద్‌లోని సరూర్‌ నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో కొనసాగుతుండగా, వరంగల్‌-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు నల్గొండలో ఆర్జాలబావి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాముల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రెండు నియోజకవర్గాల్లో పోటీలో నిలిచిన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ఉండటంతోపాటు పోలింగ్‌ కూడా భారీగా జరగటంతో ఫలితాలు వెలువడేందుకు ఒకటిన్నర నుంచి రెండు రోజుల వరకు పడుతుందన్న అభిప్రాయం ఎన్నికల సంఘం అధికారుల్లో కూడా వ్యక్తమవుతోంది. మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌లో 93 మంది పోటీ చేయగా 3,57,354 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వరంగల్‌-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గంలో 71 మంది అభ్యర్థులు పోటీ చేయగా 3,86,320 మంది ఓట్లు వేశారు.

అటు ఆంధ్రప్రదేశ్‌లో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కాకినాడ జేఎన్‌టీయూ, గుంటూరు ఏసీ కళాశాలల్లో కొనసాగుతోంది. కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గంలో 19 మంది, ఉభయగోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గంలో 11 మంది తలపడ్డారు. ఈ రెండుచోట్ల కలిపి 30,972 మంది ఓటర్లుండగా వారిలో 28,622 మంది (92.41%) ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓట్ల లెక్కింపునకు గుంటూరులో 14, కాకినాడలో 10 టేబుళ్లను ఏర్పాటు చేశారు.


ఓట్ల లెక్కింపు ఇలా..

పోలైన ఓట్లల్లో తొలుత చెల్లుబాటు కాని వాటిని వేరు చేస్తారు. పోటీ చేసిన అభ్యర్థుల్లో ఎవరికీ తొలి ప్రాధాన్య ఓటు పడకపోయినా దాన్ని చెల్లనిదిగానే పరిగణిస్తారు. అనంతరం చెల్లుబాటయ్యే వాటిలోనుంచి 25 బ్యాలెట్‌ పత్రాలను ఒక కట్టగా కడతారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత లెక్కింపు చేపడతారు. చెల్లుబాటైన వాటిల్లో ఎవరైనా అభ్యర్థికి తొలి ప్రాధాన్య ఓట్లు 50% కన్నా ఒక్కటి ఎక్కువగా వచ్చినా ఆ అభ్యర్థి విజయం సాధించినట్లు ప్రకటిస్తారు. అభ్యర్థుల్లో ఏ ఒక్కరికీ తొలి ప్రాధాన్య ఓట్లు 50% కంటే ఎక్కువ రాకుంటే… వారిలో అతి తక్కువ తొలి ప్రాధాన్య ఓట్లు వచ్చిన అభ్యర్థిని తొలగిస్తారు. ఆ అభ్యర్థి బ్యాలెట్‌ పత్రంలో రెండో ప్రాధాన్య ఓట్లు ఎవరికి పడ్డాయో గుర్తించి ఆయా అభ్యర్థులకు వాటిని బదలాయిస్తారు. అందులో ఎవరైనా అభ్యర్థికి 50% కంటే ఒక్కటి అధికంగా వచ్చినా వారు గెలిచినట్లు ప్రకటిస్తారు. అప్పటికీ ఫలితం తేలకుంటే.. మొదటి ప్రాధాన్య ఓట్లు తక్కువగా వచ్చిన రెండో అభ్యర్థిని తొలగిస్తారు. అతని రెండో ప్రాధాన్య ఓట్లను, మొదట తొలగించిన అభ్యర్థికి వచ్చిన మూడో ప్రాధాన్య ఓట్లను మిగతా అభ్యర్థులకు కలుపుతారు. అలా ఎవరో ఒకరికి… 50% కంటే ఒక్క ఓటైనా అధికంగా వచ్చేంతవరకూ లెక్కింపు కొనసాగించి విజేతను నిర్ణయిస్తారు.

ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కేంద్రంలో గందరగోళం

- Advertisement -

నల్గొండ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కేంద్రంలో గందరగోళం నెలకొంది. ఓట్ల లెక్కింపుపై వివిధ పార్టీల ఏజెంట్లు అభ్యంతరం తెలపడంతో ఉద్రిక్తత నెలకొంది. 8 బ్యాలెట్ బాక్సులకు సీల్ లేదని ఏజెంట్లు ఆందోళనకు దిగారు. సీల్ లేని బ్యాలెట్ బాక్సులను లెక్కింపునకు తెచ్చారని ఆరోపణలు చేశారు. దీంతో నిరసనకు దిగిన ఏజెంట్లను పోలీసులు సముదాయించారు. వీరిలో ఐదుగురు ఏజెంట్లను పోలీసులు ఉన్నతాధికారుల వద్దకు పంపారు.

మరోవైపు ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాం తెలంగాణ ఎన్నికల కమిషనర్‌ను కలిశారు. రాత్రి వేళల్లో కౌంటింగ్ కేంద్రాల్లో గొడవలు జరిగే అవకాశం ఉందని, దీనికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కొందరు కౌంటింగ్ కేంద్రాల్లో గందరగోళానికి యత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. అధికారులపై అధికార పార్టీ టీఆర్ఎస్ ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని ఫిర్యాదు చేశారు. తమకున్న సమాచారంతోనే సీఈసీని కలిసి ఫిర్యాదు చేశామని కోదండరాం అన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో యూటీఎఫ్ అభ్యర్థి విజయం

ఏపీలోని ఉభయగోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా యూటీఎఫ్ అభ్యర్థి విజయం సాధించారు. 1,537 ఓట్ల తేడాతో యూటీఎఫ్ అభ్యర్థి షేక్ సాబ్జీ విజయం సాధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement