ఏపీలో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటు రాజకీయ వేడి పెంచుతోంది. కడప జిల్లా ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటు వివాదం రాజకీయ కాక రేపుతోంది. వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుకు చేయడంపై బీజేపీ నేతలు మండిపడ్డారు. విగ్రహ ఏర్పాటుకు అనుమతి లేదంటూ ఇటీవల జిల్లా కలెక్టర్ కూడా ఉత్వర్వులు ఇచ్చారు. అయితే, తాజాగా దీనిపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
టిప్పుసుల్తాన్ విగ్రహం ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ అనుమతి నిరాకరించారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని.. ఈ విషయంలో బీజేపీ నేతలు సోమువీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. త్వరలోనే ప్రభుత్వ అనుమతితోనే టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఒకవేళ ప్రభుత్వ స్థలంలో అనుమతి లభించకపోతే ప్రైవేటు స్థలంలో అయినా టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.
విగ్రహం ఏర్పాటు కోసం కౌన్సిల్ ఇచ్చిన తీర్మానాన్ని ప్రభుత్వ అనుమతి కోసం పంపామని, అనుమతి రాగానే ముందుకు వెళ్తామని స్పష్టం ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తాము దేశద్రోహులు, మతోన్మాదుల విగ్రహాలేమీ పెట్టడం లేదన్నారు. టిప్పు సుల్తాన్ దేశభక్తుడా? కాదా? అనేది రాజ్యాంగం, ప్రభుత్వాలు నిర్ణయిస్తాయన్నారు. సోమువీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి మతాల మధ్య చిచ్చుపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటుకు అనుమతి నిరాకరిస్తూ కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులు ఇప్పటివి కాదని, జిల్లా ఎస్పీ అభ్యర్థన మేరకు గత నెల 24న ఇచ్చినవని తెలిపారు. బీజేపీ నేతలు పాత ఉత్తర్వులను చూపించి అందరినీ మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని రాచమల్ల శివప్రసాద్‌రెడ్డి మండిపడ్డారు.
ఇది కూడా చదవండి: దళిత వర్గానికే కాంగ్రెస్ టికెట్?