Saturday, November 23, 2024

MLA Quota MLC : TRS అభ్యర్థులు ఖరారు.. వారిద్దరికి పక్కా..!

ఎమ్మెల్యే కోటా శాసన మండలి ఎన్నికల అభ్యర్థుల ఎంపిక టిఆర్ఎస్ పార్టీ దాదాపు ఖరారు చేసింది. పోటీ తీవ్రంగా ఉన్నందున సుదీర్ఘ కసరత్తు చేస్తోంది. నేడు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఎమ్మెల్యే కోటా.. స్థానిక సంస్థల కోటా అభ్యర్థులు మొత్తం 18 మంది పేర్లు ఒకేసారి వెల్లడించే అవకాశం ఉంది. ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలంటూ టిఆర్ఎస్ పార్టీలో పోటీ అధికంగా ఉంది. గతంలో ఇచ్చిన హామీతో పాటు, సామాజిక, రాజకీయ సమీకరణలను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. ఎమ్మెల్సీ కోటాకు నామినేషన్ల గడువు రేపటితో ముగియనుండగా.. స్థానిక సంస్థల కోటాకు రేపటి నుంచి నామినేషన్లు ప్రారంభం కానున్నాయి.

ఎమ్మెల్యే కోటా టికెట్ కోసం తాజా మాజీలతో పాటు.. చాలా మంది నేతలు ఆశిస్తున్నారు. మాజీ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనచారి, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎర్రోళ్ల శ్రీనివాస్, కౌశిక్ రెడ్డి, కోటిరెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, ఎల్ రమణ, గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. గుత్తా సుఖేందర్ రెడ్డికి మరోసారి ఎమ్మెల్సీ పదవి ఖాయమే అయినప్పటికీ.. ఏ కోటాలో అవకాశం ఇస్తారనేది ఉత్కంఠగా మారింది. మండలి మాజీ చైర్మన్ సుఖేందర్ రెడ్డి, ఎల్.రమణకు గవర్నర్ కోటా లేదా స్థానిక సంస్థల కోటాలో మండలికి పంపించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.అసెంబ్లీలో సంపూర్ణ బలం ఉన్నందున.. ఎమ్మెల్యే కోటాలో ఆరు స్థానాలు TRSకె దక్కనున్నాయి.

మరోవైపు స్థానిక సంస్థల అభ్యర్థులపై కూడా TRS నాయకత్వం కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల కోటాలో ఎన్నికైన పురాణం సతీష్ కుమార్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తేరా చిన్నపరెడ్డి, భూపాల్ రెడ్డి, కల్వకుంట్ల కవిత, బాలసాని లక్ష్మీనారాయణ, భానుప్రసాదరావు, నారదాసు లక్ష్మణ్ రావు, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, సుంకరి రాజు పదవీకాలం జనవరి నాలుగో తేదీతో పూర్తి కానుంది. అందరూ మరోసారి కొనసాగాలని ఆశిస్తున్నారు.
అయితే వీరిలో అయిదారుగురికి అవకాశం ఉండక పోవచ్చునని టిఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement