Monday, November 25, 2024

Farm House Deals: నిన్ను లేపేస్తాం, బతకనియ్యం.. ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఎమ్మెల్యేకు బెదిరింపులు

టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని చంపేస్తామని బెదిరింపు ఫోన్​ కాల్స్​ వస్తున్నాయి. ఈ మేరకు ఆయన ఆదివారం మాదాపూర్ ఏసీపీ సీహెచ్ రఘునందన్ రావుకు కంప్లెయింట్​ చేశారు. ఫోన్ కాల్స్ చేసి తనను చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫోన్ కాల్స్​ ఎక్కువగా ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల నుంచి వస్తున్నట్టు తెలిపారు. 11 ఫోన్ నెంబర్ల నుంచి తనకు విపరీతమైన ఫోన్ కాల్స్ వస్తున్నాయని పోలీసులకు తెలియజేశారు.

కాల్​ చేసిన వ్యక్తులు తనను అసభ్య పదజాలంతో తిడుతున్నారని, తాను త్వరలో చనిపోవడం ఖాయమని చెబుతున్నారని, వారి వాల్ల తనకు ప్రాణహాని ఉందన్నారు. ఫోన్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రోహిత్​రెడ్డి పోలీసులను కోరారు. కాగా, ఈ ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇక.. బీజేపీతో తమను కొనుగోలు చేయడానికి యత్నించిందని ఎమ్మెల్యే రోహిత్​రెడ్డి ముగ్గురిపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో గతంలో ఫిర్యాదు చేశారు. టీఆర్‌ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీలోకి లాక్కునేందుకు ప్రయత్నించారని ఆ ఫిర్యాదులో తెలిపారు. బీజేపీ ఏజెంట్లు కొంతమంది తాము బీజేపీలో చేరితే పెద్దమొత్తంలో డబ్బు, పార్టీలో ప్రముఖ పదవులు, కేంద్ర ప్రభుత్వ కాంట్రాక్టులు ఇప్పించేందుకు తమతో డీల్​ చేసుకోవడానికి వచ్చారని తెలిపారు. దానికి సంబంధించిన ఆడియో రికార్డింగ్‌లు  కూడా ఆ మధ్య సోషల్​ మీడియాలో చక్కర్లు కొట్టాయి. బీజేపీ మాట వినకుంటే సీబీఐ, ఈడీ దాడులు చేయిస్తామని, అక్రమ కేసులు పెట్టి తమను అరెస్టు చేయిస్తామని బెదిరించారని రోహిత్ రెడ్డి ఆరోపించారు.

కాగా, బీజేపీకి చెందిన ముగ్గురు వ్యక్తులు – రామచంద్ర భారతి, నంద కుమార్, సింహయాజి స్వామిని మొయినాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును విచారించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ సిట్​ బృందానికి హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ నేతృత్వం వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement