వికారాబాద్ జిల్లా తాండూరులో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. ఈ వ్యవహారంపై అధిష్ఠానం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. తాండూరు వ్యవహారాం మంత్రి కేటీఆర్ వరకు చేరింది. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి.. మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు. మహేందర్ రెడ్డి వ్యవహారాన్ని ఆయన కేటీఆర్ కు వివరించినట్టు తెలుస్తోంది. ఘటనపై కేటీఆర్ సీరియస్ అయినట్టు సమాచారం. అక్కడి పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డినీ అధిష్ఠానం పిలిచినట్టు సమాచారం. ఆయన కూడా కేటీఆర్ తో సమావేశమయ్యే అవకాశం ఉంది.
తాండూరు పట్టణంలో జరిగిన భావిగి భద్రేశ్వరస్వామి రథోత్సవ కార్యక్రమంలో తనకు అడ్డుగా ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అనుచరులతో కూర్చున్నారని, అయినప్పటికీ సీఐ రాజేందర్‌రెడ్డి వారికి అడ్డు చెప్పలేదని మహేందర్‌రెడ్డి సీఐకి ఫోన్ చేసి దూషించారు. గుడిలో కార్యక్రమానికి సంబంధించి రోహిత్ రెడ్డి, మహేందర్ రెడ్డిలు హాజరుకాగా.. తనను కాదని ఎమ్మెల్యే అనుచరులకు కార్పెట్ వేశారంటూ తాండూరు సీఐకి మహేందర్ రెడ్డి బూతు పురాణం అందుకున్న సంగతి తెలిసిందే. తాండూరు టౌన్ సీఐ రాజేందర్‌రెడ్డిపై రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు ఉన్న ఓ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీంతో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి స్పందించారు. ఆ ఆడియో తనది కాదని అన్నారు. ఇసుక దందాలో రోహిత్ రెడ్డి, సీఐకి ప్రమేయం ఉందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. తాను ఈ విషయాన్ని కోర్టులో తేల్చుకుంటానని, ఎన్ని కేసులు పెట్టినా సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డే ఇదంతా చేయిస్తున్నారని ఆయన అన్నారు.
మరోవైపు మహేందర్‌రెడ్డి తనను దూషించడంపై ఇప్పటికే తాను పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చానని సీఐ తెలిపారు. మహేందర్‌రెడ్డి తీరుపై రోహిత్‌రెడ్డి మద్దతుదారులు గతరాత్రి తాండూరు పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేశారు.