నల్లగొండ జిల్లా ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత ఎన్నికను సవాల్ చేసిన వ్యక్తి చనిపోయాడు. ఈ నేపథ్యంలో ఆ ఎన్నికను మరెవరైనా ఎవరైనా సవాల్ చేయడానికి హైకోర్టు అనుమతిచ్చింది. ఆమె చేతిలో ఓటమిని చెందిన ఎస్.సతీష్‌కుమార్ దాఖలు చేసిన ఎలక్షన్ పిటిషన్‌ను జస్టిస్ ఎం.లక్ష్మణ్ ఇటీవల విచారణ జరిపారు. ఈ కేసు విచారణలో ఉండగా పిటిషనర్ సతీష్‌కుమార్ చనిపోయిన కారణంగా ఎమ్మెల్యేగా సునీత ఎన్నికపై ప్రజలకు అభ్యంతరాలు ఉంటే ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేసుకునేందుకు ఆస్కారం ఉందని స్పష్టం చేశారు.
పిటిషనర్ మరణించిన విషయాన్ని, ఆలేరు ఎమ్మెల్యే ఎన్నికను సవాల్ చేస్తూ ప్రజలు ఎవరైనా ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ వెలువరించాలని ఆదేశించారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 112 (1) కింద ప్రకారం ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తి మరణిస్తే.. పిటిషన్ రద్దు అవుతుందని, ఇలాంటి పరిస్థితుల్లో సదరు చట్టంలోని 112 (2) సెక్షన్ కింద ఆ ఎన్నికను సవాల్ చేసేందుకు ప్రజలు అవకాశం ఇవ్వాల్సివుంటుందని వివరించారు.
ఆ చట్టంలోని 112 (3) ప్రకారం పిటిషనర్ మరణించినట్లుగా ప్రభుత్వం గెజిట్ ప్రచురణ ద్వారా ప్రజలకు తెలియజేసి, ఆలేరు ఎన్నికను ఎవైనా సవాల్ చేయదలిస్తే గెజిట్ ప్రచురణ జరిగిన 14 రోజుల్లోగా హైకోర్టులో ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చునని ప్రజలకు తెలియజేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఆలేరు ఎన్నికను సవాల్ చేసిన ఏకైక పిటిషనర్ మరణించినందున 112 సెక్షన్‌లోని నిబంధనలను అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. తదుపరి విచారణను జూన్ 19కి వాయిదా వేశారు.