Friday, November 22, 2024

Big Story: ఇంటింటా ఎమ్మెల్యే ఫలాలు.. నిజమైన ప్రజా ప్రతి‘నిధి’ దాసరి!

పెద్దపల్లి (ప్రభా న్యూస్):  ప్రజా ప్రతినిధి అంటే ఎవరైనా చెప్పేది తనను ఎన్నుకున్న ప్రజలకు నాయకుడని.. వారికి ప్రాతినిధ్యం వహించే లీడర్ అని.. అందరికీ తెలిసింది కూడా ఇదే.. కానీ నిజమైన ప్రజా ప్రతినిధి అంటే ఏమిటి అనేది పెద్దపల్లి ఎమ్మెల్యే ను చూస్తే అర్థమవుతుంది.. అంతేకాదు ప్రజా ప్రతినిధి అన్న పదానికి ఇన్నాళ్లకు సరైన అర్థం తెలియజేశాడని స్పష్టమవుతోంది.. ఎన్నికలు రాగానే డబ్బు, మద్యం ఇచ్చి ఓట్లు వేయించుకొని గెలిచాక మొహం చాటేసే నాయకులనే చూస్తున్నాం.. కానీ తనను నమ్ముకుని ఓట్లు వేసిన ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ అండగా ఉండడమే కాకుండా తన వల్ల వారికి ఎప్పుడూ లాభమే జరిగే విధంగా చేసి చూపించాడు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి.. ప్రతి ఇంట తన వల్ల ఆరోగ్యపరమైన “నిధి”ని నింపాడు. అందుకే అసలైన ప్రజాప్రతినిధి ఈ దాసరి అంటున్నారు.

ప్రతి ఒక్కరి ఆరోగ్యంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించే దిశగా చర్యలు చేపట్టిన ఎమ్మెల్యే గెలిచిన నాటినుండి నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి ఐదు పండ్ల మొక్కలను స్వంత ఖర్చులతో పంపిణీ చేశారు. ఫలితంగా నేడు ప్రతి ఇంటా ఈ ఎమ్మెల్యే అందించిన ఫలాలు ప్రతి ఒక్కరి నోటికి చేరుతున్నాయి.. పెద్దపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే దాసరి చేసిన ఈ కృషిని చూసిన ప్రతి ఒక్కరు ప్రజాప్రతినిధులు అందరికీ రోల్ మాడల్ ఈ మనోహర్ అని కొనియాడుతున్నారు. దాసరి చేసిన కృషి పై ప్రత్యేక కథనం. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన దాసరి మనోహర్ రెడ్డి తనను నమ్మి గెలిపించిన ప్రజల కోసం ఏదైనా చేయాలని తలంచాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను హరిత తెలంగాణ మార్చేందుకు  హరితహారాన్ని ప్రారంభించగా ఆయన అడుగులో అడుగువేసే మనోహర్ రెడ్డి నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి ఐదు పండ్ల మొక్కలను సొంత ఖర్చులతో ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.

అనుకోవడమే ఆలస్యం 2015 జూలై 5వ తేదీన ముఖ్యమంత్రి కెసిఆర్ చేతుల మీదుగా ప్రతి ఇంటికి ఐదు పండ్ల మొక్కల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు.. మొదటి ఏడాది రెండు లక్షల పండ్ల మొక్కలను అందించగా, ప్రతి ఏడాది లక్ష పండ్ల మొక్కలు చొప్పున కొనుగోలు చేసి ఇప్పటివరకు నియోజకవర్గంలో ఏడు లక్షల పండ్ల మొక్కలను ఇంటింటికి పంపిణీ చేశారు. తమ ఎమ్మెల్యే ఇచ్చిన పండ్ల మొక్కలను ప్రజలు సంరక్షించుకునే బాధ్యత తీసుకోవడంతో అవి ఇప్పుడు ఏపుగా పెరిగి ఫలాలను ఇస్తున్నాయి. పెద్దపల్లి, సుల్తానాబాద్ పట్టణాల తో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని గ్రామాల్లో ఎమ్మెల్యే అందించిన పండ్ల మొక్కలు ఏపుగా పెరిగి ఫలాలని ఇస్తున్నాయి. గ్రామాల్లోని ప్రతి ఇంటా సపోటా, పనస, జామ, యాపిల్ బెర్రీ,  మామిడి, సీతాఫలం తో పాటు నిమ్మ చెట్లు ఏపుగా పెరగడంతోపాటు ప్రతి ఒక్కరు తినేందుకు పండ్లను ఇస్తున్నాయి.

దాసరి చేసిన కృషికి 2016 ఆగస్టు 15వ తేదీన కరీంనగర్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన వేడుకల్లో హరిత మిత్ర అవార్డు అందజేశారు. 2017 అసెంబ్లీ సమావేశాల్లో సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు అసెంబ్లీ లో దాసరి చేసిన సేవలను కొనియాడుతూ ప్రతి ఒక్కరు మనోహర్ రెడ్డి ని ఆదర్శంగా తీసుకోవాలని పిలిపునివ్వడంతో పాటు నియోజకవర్గ అభివృద్ధి కోసం పది కోట్ల రూపాయలు మంజూరు చేశారు. హరిత ప్రేమికుడైన ఎమ్మెల్యే పండ్ల మొక్కల పంపిణీ సత్ఫలితాలను ఇచ్చి ఎన్నుకున్న ప్రజలకు ప్రతినిత్యం ఫలాలను ఇవ్వడం తో నియోజకవర్గ ప్రజలు దాసరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఓట్ల కోసం జిమ్మిక్కులు చేసే నాయకులను ఇంతకాలం చూశామని ఎన్నుకున్న ప్రజలకు చిరకాలం గుర్తుండేలా సేవలందిస్తున్న మనోహర్ రెడ్డి ని అన్ని వర్గాల ప్రజలు అభినందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement