Wednesday, November 20, 2024

118 బోగీల ‘మిషన్ త్రివేణి’ గూడ్స్.. సరుకు రవాణాలో కొత్త రికార్డు

అమరావతి, ఆంధ్రప్రభ: దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో మూడు వేర్వేరు గమ్యాలకు నాలుగు అతి పొడవైన రైళ్లను విజయవంతంగా నడిపించింది. ఈ వినూత్న విధానానికి పవిత్ర నదుల సంగమంగా భావించే ‘త్రివేణి’ అని పేరు పెట్టారు. ఇందుకోసం విజయవాడ డివిజన్‌ ప్రత్యేక చొరవ తీసుకుని, ఒకే రోజు నాలుగు అతి పొడవాటి రైళ్లుగా నడిపించింది. సాధారణ సరుకు రవాణా రైళ్ల కన్నా రెండింతలు పొడవుగా ఉండే ఈ భారీ రైళ్లను రెండు గూడ్స్‌ రైళ్లు జతచేయడం ద్వారా వాటి సామర్థ్యాన్ని పెంపొందించడం జరుగుతుంది. ఇవి కీలకమైన సెక్షన్లలో సామర్థ్య నిర్వహణ పరిమితుల సమస్యలను పరిష్కరించడంలో అత్యంతం ప్రభావం చూపుతాయి. నాలుగు భారీ రైళ్లలో, రెండు 118 ఓపెన్‌ వ్యాగన్లు(58 జి58 బాక్స్‌ ఎన్‌ వ్యాగన్లు) చొప్పున కలిగి ఉన్నాయి. విజయవాడ నుంచి విశాఖపట్నం మీదుగా తాల్చేర్‌ వరకు సుమారు 900 కిలోమీటర్ల దూరానికి సరుకు రవాణా చేశాయి. మరో పొడవాటి రైలు రెండు ఓపెన్‌ వ్యాగన్‌ రైళ్లతో(ప్రతి దానిలో 59 జి 59 బాక్స్‌ ఎన్‌ వ్యాగన్లు) జతపరిచి, అదాని కృష్ణపట్నం పోర్టు నుంచి ఓబులవారిపల్లి మీదుగా 645 కిమీల దూరంలో ఉన్న కేశోరామ్‌ సిమెంట్‌కు రవాణా చేసింది. అలాగే విజయవాడ నుంచి కొండపల్లి వరకు బీసీఎన్‌ రేక్స్‌ కలిగిన రెండు రైళ్ల కవర్డ్‌ వ్యాగన్లను జతపరిచి రవాణా చేశారు. మొత్తం మీద ఈ నాలుగు భారీ రైళ్లు విజయవాడ నుంచి మూడు వేర్వేరు గమ్యాలకు రవాణా అయ్యాయి. దక్షిణ మధ్య రైల్వే తీసుకొచ్చిన ఈ వినూత్న పద్ధతి వల్ల గూడ్స్‌ రైళ్ల నిర్వహణలో వేగం పెరిగింది. అలాగే ఈ ప్రక్రియ ద్వారా ఖాళీ, లోడెడ్‌ వ్యాగన్లు గమ్యస్థానాలకు తక్కువ సమయంలో చేరతాయి. రెండు రైళ్లను జతపరిచి ఒక రైలుగా నడపడం ద్వారా సిబ్బంది అవసరాలు, భారీ లోడ్లను త్వరగా తరలించడం వంటి ప్రయోజనాలు ఉన్నాయి. అంతే కాకుండా రద్దీ, కీలకమైన సెక్షన్లలో, ముఖ్యమైన మార్గాల్లో ఇతర రైళ్ల నిర్వహణకు ప్రయోజనకరంగా ఉంటు-ంది. వినూత్న పద్ధతిలో సరుకు రవాణా రైళ్ల నిర్వహణను చేపట్టి సరుకు రవాణా సామర్థ్యం పెంపొందించేందుకు కృషి చేస్తున్న విజయవాడ డివిజన్‌ అధికారులు, సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్య ప్రత్యేకంగా అభినందించారు. భారీ రైళ్లను నడపడం ద్వారా రోలింగ్‌ స్టాక్‌ నిర్వహణలో రైల్వేకి ఉత్తమంగా తోడ్పడుతుందని, తక్కువ సమయంలో భారీ స్థాయిలో సరుకుల రవాణాకు ప్రయోజకరంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement