ఈ దేశాన్ని ఎవరు మార్చాలి ? ఈ సమాజాన్ని ఎవరు ఉద్దరించాలి ? ప్రజల ఆశయాలను తీర్చేదెవరు ? పేదరికాన్ని ఎవరు నిర్మూలించాలి? అణగారిని ప్రజలను ఎవరు ఆదరించాలి ? విద్వేషం లేని లోకాన్ని ఎలా స్థాపించాలి ? ప్రజాస్వామ్య రీతిలో ధర్మపాలన ఎలా సాగించాలి ? రాజ్యాంగం ఆకాంక్షించిన అభ్యున్నతిని ఎలా సాధించాలి ? ఇవే ఇప్పుడు కేసీఆర్ మదిలో మెదులుతున్న ఆలోనలు.. ఈ భూగోళంపై ఈ దేశాన్ని సర్వోన్నతంగా నిలపడమే ఆయన స్వప్నం. ఆ టార్గెట్‌తోనే తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ సమరశంఖం పూరిస్తున్నారు. ఈ దేశానికి పట్టిన పీడను విజయదశమి వేళ తరిమికొట్టే ప్రయత్నాన్ని ఆయన మొదలుపెట్టారు. ప్రజారంజక పాలనే పరమావధిగా భావిస్తున్న కేసీఆర్.. ఇవాళ కొత్త రాజకీయ పార్టీకి జీవం పోస్తున్నారు.
– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
భారతదేశాన్ని, భారత ప్రజలను ప్రగతిశిఖరంపై ప్రతిష్టింపజేసందుకు కేసీఆర్ ప్రతినబూనారు. ఈ నేపథ్యంలో ఆయన కొన్ని నెలల నుంచి దేశ పర్యటన చేపట్టారు. పలు రాష్ట్రాలను విజిట్ చేశారు. కేంద్ర సర్కార్ సాగిస్తున్న ఆగడాలను ఆయా రాష్ట్రాల నేతలతోనూ చర్చించారు. అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను కేసీఆర్ వివిధ దేశాధినేతలతోనూ ముచ్చటించారు. బీజేపీ అవలంభిస్తున్న వైఖరిని నిర్మోహమాటంగా వ్యతిరేకించారు. సమసమాజ స్థాపన కోసం సమాఖ్య పాలన అవసరం అన్న నినాదాన్ని సీఎం కేసీఆర్ ప్రతి రాష్ట్ర పర్యటనలోనూ తన స్వరంగా వినిపించారు. ఈ దేశానికి మార్పు అవసరం. ఆ మార్పును తీసుకువచ్చేందుకు కేసీఆర్ కొత్త పార్టీకి ప్రాణం పోస్తున్నారు.
కొన్ని దశాబ్ధాల పాటు కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని ఏలింది. కానీ ఆ పార్టీ ఈ దేశ ప్రజల స్థితిగతులను మార్చలేకపోయింది. రాజ్యాంగ లక్ష్యాలను నెరవేర్చడంలో ఆ పార్టీ దారుణంగా విఫలమైంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని పాలిస్తోంది. ఆ పార్టీ కూడా పేలవ పాలన కొనసాగించింది. ఆశించిన స్థాయిలో ప్రగతి లేదు. ప్రజల అవసరాలను తీర్చే ఆరాటం కూడా ఆ పార్టీకి లేదు. ఈ నేపథ్యంలో దేశ ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఆలోచనలు మొదలుపెట్టారు. 2018 నుంచే ఆయన దేశ రాజకీయాలపై దృష్టి పెట్టారు.
కాంగ్రెస్, బీజేపీ విఫలమైన నేపథ్యంలో కొత్త పార్టీ అవసరమన్న విషయాన్ని కేసీఆర్ పదే పదే చెబుతూ వచ్చారు. ఆ దిశగానే ఇవాళ గులాబీ పార్టీ కొత్త అవతారమెత్తనున్నది. 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా సీఎం కేసీఆర్ తన ప్రణాళికలు వేస్తున్నట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ కొత్త పార్టీ ప్రకటిస్తున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.