కేరళలోని కొట్టాయం జిల్లాలో కనిపించకుండా పోయిన బీజేపీ కార్యకర్త డేడ్‌బాడీ దొరికింది. అతని మృతదేమం ఓ ఇంటి నేల కింద నుంచి ఇవ్వాల (శనివారం) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది దృశ్యం సినిమాలోని సన్నివేశాన్ని పోలి ఉందని పోలీసులు చెబుతున్నారు.
43 ఏళ్ల బిందు కుమార్ సెప్టెంబరు 26వ తేదీ నుండి కనిపించకుండా పోయాడు. సెప్టెంబర్ 28వ తేదీన అతని కుటుంబం అదృశ్యమైనట్టు ఫిర్యాదు చేసింది. దీంతో కేరళలోని చంగనస్సేరిలోని ఒక కాలనీ సమీపంలోని టవర్ లొకేషన్‌లో బిందు కుమార్ మొబైల్ ఫోన్‌ను పోలీసులు ట్రేస్ చేశారు. సమీప ప్రాంతం నుండి దొరికిన అతని బైక్, పోలీసులను కాలనీలోని ముత్తుకుమార్ ఇంటికి తీసుకువెళ్లింది. ముత్తుకుమార్తో బిందుకుమార్‌కు పరిచయం ఉందని పోలీసుల విచారణలో తెలిసింది.
తాజాగా కాంక్రీట్ వేసిన ఓ ఇంటి ప్రాంతంపై పోలీసులకు అనుమానం కలిగింది. దీంతో అక్కడున్న కాంక్రీట్‌ను తవ్వారు. దాదాపు ఆరు గంటలు శ్రమించిన తర్వాత అక్కడ మృతదేహం కనిపించింది. అనంతరం మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తదుపరి విచారణ కోసం వేలిముద్రల విశ్లేషణ, డాగ్ స్క్వాడ్, ఇతర బృందాలతో పోలీసు శాఖ విచారణ జరుపుతోంది.