చెన్నైలో తప్పిపోయిన ఓ చిన్నారి కేసును చాకచక్యంగా ఛేదించారు పోలీసులు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా పాపను కిడ్నాప్ చేసిన వారి ఆనవాళ్లను గుర్తించారు. ఆ తర్వాత పాప ఫొటోలను చెన్నై సిటీలోని అన్ని పోలీసు స్టేషన్లకు పంపించి సెర్చ్ చేయించారు.
మొన్నటి ఆదివారం తమ పాప ‘లాక్‌డౌన్’ కనిపించకుండా పోయిందని చిన్నారి తల్లిదండ్రులు అంబత్తూరు పోలీసులకు కంప్లెయింట్ చేశారు. లాక్‌డౌన్ మిస్సింగ్ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. పాప ఫొటోలను అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించారు. చెన్నైలోని అంబత్తూరులో ఓడిశాకు చెందిన చిన్నారి తల్లిదండ్రులు ఉంటున్నారు. అక్కడే నిర్మాణంలో ఉన్న బిల్డింగ్లో పనిచేస్తున్నారు. అయితే.. కోయంబేడు బస్ డిపోలోని ఓ బస్సులో పాప ఉన్నట్టు మంగళవారం బస్సు డ్రైవర్ గుర్తించాడు. ఈ విషయం సమీపంలోని కోయంబేడు పోలీసులకు సమాచారం అందించాడు.
కోయంబేడు పోలీసులు బస్సులో కనిపించిన పాప తప్పిపోయిన చిన్నారి ‘లాక్‌డౌన్’గా గుర్తించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఒడిశా దంపతులకు ఆ పాపను అప్పగించారు. కాగా, చిన్నారి లాక్‌డౌన్ మిస్సింగ్ కేసులో అప్రమత్తమైన అంబత్తూరు పోలీసులు కేసు ఛేదన, పాపను రక్షించడంలో కనబర్చిన చొరవకు స్థానికుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. చిన్నారి కనిపించకుండా పోయిన ప్రాంతంలోని సీసీటీవీ విజువల్స్ ఆధారంగా నిందితులను కనిపెట్టి, వారిలో ముగ్గురిని కడలూరు దగ్గర అరెస్టు చేశారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోంది.