Thursday, November 14, 2024

Romance | శృంగారానికి మంత్రిత్వ శాఖ.. ర‌ష్యా స‌ర్కారు యోచ‌న‌!

  • కొత్త జంట‌లకు ప్రభుత్వం నుంచే డబ్బులు
  • హోట‌ళ్ల‌లో బ‌స చేసినా ఖ‌ర్చంతా భ‌రిస్తారు
  • యుద్ధం కార‌ణంగా త‌గ్గిపోతున్న జ‌నాభా
  • జ‌న‌నాల రేటు పెంచే చ‌ర్య‌లు చేప‌ట్టిన ర‌ష్యా
  • మ‌ధ్యాహ్న విరామ స‌మ‌యాన్ని ఆ ప‌నికోసం వినియోగించుకోవాలి
  • స్ప‌ష్టంగా తెలియ‌జేస్తున్న‌ ర‌ష్యా అధికారులు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, స్పెష‌ల్ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు జనాభా తగ్గుదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్యను అధిగమించి, జననాల రేటును పెంచడానికి రకరకాల ప్రణాళికలు రచిస్తున్నాయి. రష్యా కూడా ప్రస్తుతం ఇలాంటి సమస్యలనే ఎదుర్కొంటుంది. జననాల రేటు పడిపోవడం, ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా చోటుచేసుకుంటున్న ప్రాణనష్టం.. ఈ ఆందోళనకు ప్రధాన కారణంగా మారింది. ఈ క్రమంలోనే దేశంలో తగ్గుతున్న జననాల రేటును ఎదుర్కొనేందుకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని రష్యా ప్రభుత్వం ఆలోచించింది. ఓ మీడియా సంస్థ నివేదిక ప్రకారం.. దేశంలో క్షీణిస్తున్న జనాభాను పెంచేందుకు రష్యా ”శృంగార మంత్రిత్వ శాఖ”ను రూపొందించే ఆలోచనలో ఉంది.

త‌గ్గుతున్న జ‌నాభా..

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు విధేయురాలు, కుటుంబ రక్షణ, పితృత్వం, ప్రసూతి.. బాల్యంపై రష్యన్ పార్లమెంట్ కమిటీ అధ్యక్షురాలుగా ఉన్న 68 ఏళ్ల నినా ఒస్టానినా అటువంటి మంత్రిత్వ శాఖను కోరుతూ వేసిన పిటిషన్‌ను సమీక్షిస్తున్నారు. ఉక్రెయిన్- రష్యా యుద్దం కారణంగా ఇరువైపుల‌ ప్రాణనష్టం జ‌రుగుతోంది. మరోవైపు రష్యాలో జననాల రేటు తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలోనే దేశ జనాభా క్షీణతను అరికట్టాలని పుతిన్ ఇచ్చిన పిలుపుకు ప్రతిస్పందనగా రష్యా అధికారులు అనేక విధానాలను రూపొందిస్తున్నారు. ఈ సమయంలో శృంగార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తెర‌మీద‌కు వచ్చింది.

- Advertisement -

సంతానోత్ప‌త్తి ఆవ‌శ్య‌కత‌..

ఓ మ్యాగజైన్ నివేదిక ప్రకారం.. గ్లావ్‌పీఆర్ ఏజెన్సీ ద్వారా ఒక పిటిషన్ శృంగార మంత్రిత్వ శాఖ కోసం ఆలోచనను లేవనెత్తింది. క్షీణిస్తున్న జనన రేటును పరిష్కరించడానికి ఇది చొరవ చూపడం, జనన రేటు పెంచే కార్యక్రమాలకు నాయకత్వం వహించడం దీని విధులుగా ప్రతిపాదించారు. పుతిన్ మద్దతుతెలిపేవారిలో ఒకరైన డిప్యూటీ మేయర్ అనస్తాసియా రకోవా.. క్రెమ్లిన్ లక్ష్యాలకు అనుగుణంగా సంతానోత్పత్తి ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ”ఒక మహిళ సంతానోత్పత్తి స్థాయిని, గర్భవతి పొందే సామర్థ్యాన్ని తెసుకోవడానికి మాకు ఒక ప్రత్యేక పరీక్ష ఉందని నగరంలో ప్రతి ఒక్కరికీ తెలుసు” అని రాకోవా అన్నారు. పిల్లలను కలిగి ఉండటానికి మహిళలు ప్రాధాన్యతనివ్వాలని కోరారు.

హోట‌ళ్ల‌లో గ‌డిపే వారి ఖ‌ర్చంతా ప్ర‌భుత్వానిదే..

అయితే సంతానోత్పత్తిని పెంచేందుకు శృంగార కార్యకలాపాలను ప్రోత్సహించే ప్రతిపాదనల విషయానికి వస్తే.. సన్నిహిత కార్యకలాపాల కోసం రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 2 గంటల మధ్య ఇంటర్నెట్ నిలిపివేయడం, లైట్లను స్విచ్ ఆఫ్ చేయాలని సూచించారు. మరొక ఆలోచన ప్రకారం.. రాష్ట్రం ఇంట్లోనే ఉండే తల్లులకు ఇంటి పని కోసం వేతనం చెల్లించాలి. ఈ ఆదాయాలు వారి పెన్షన్ లెక్కలకు దోహదపడతాయి. అలాగే సంబంధాలను ప్రోత్సహించడానికి 5,000 రూబిళ్లు (£40) వరకు ఫస్ట్ డేట్‌కు నిధులు సమకూర్చాలని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. వివాహం తర్వాత హోటళ్లలో బస చేసే జంటకు అయ్యే ఖర్చును భరించడం వంటి ఆలోచన కూడా ఉంది. ఇలా రకరకాల ఆలోచనలు ప్ర‌భుత్వం ముందు ఉన్న‌ట్టు తెలుస్తోంది.

విరామ స‌మ‌యాల్లో అలా..

మరోవైపు ప్రాంతీయ ఆరోగ్య మంత్రి యవ్జెనీ షెస్టోపలోవ్.. రష్యన్ ప్రజలు కాఫీ, భోజన విరామాలను ”సంతానం” కోసం ఉపయోగించాలని సూచించారు. ”మీరు విరామ సమయంలో సంతానోత్పత్తిలో పాల్గొనవచ్చు.. ఎందుకంటే జీవితం చాలా త్వరగా అయిపోతుంది” అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement