Tuesday, November 26, 2024

పారదర్శకత కోసం వార్షిక నివేదిక: కేటీఆర్

సీఎం కేసీఆర్ నాయక్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతిపథంలో దూసుకెళ్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్‌ విధానాలు, సమష్టి కృషితోనే ఇది సాధ్యమయ్యిందన్నారు. హైదరాబాద్ లో పరిశ్రమలు, ఐటీ శాఖ వార్షిక నివేదికలను మంత్రి కేటీఆర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం దార్శనికతతో దేశంలోనే అగ్రగామిగా ఎదుగుతున్నామని చెప్పారు. పారదర్శకత కోసం వార్షిక నివేదికలు విడుదల చేస్తున్నామని తెలిపారు. 2020-21లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.9.78 లక్షల కోట్లుగా ఉందన్నారు. వ్యవసాయ రంగంలో 20.9 శాతం వృద్ధి సాధించామని మంత్రి తెలిపారు.

దేశ తలసరి ఆదాయం రూ.1,27,768గా ఉండగా, రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2,27,145గా ఉందన్నారు. 2019-20లో రాష్ట్ర ఐటీ ఎగుమతులు రూ.1.28 లక్షల కోట్లు కాగా, 2020-21లో అవి రూ.1.45 లక్షల కోట్లకు పెరిగాయని చెప్పారు. ఐటీలో దేశంతో పోలిస్తే రెట్టింపు వృద్ధి సాధించామన్నాని వివరించారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు 3.23 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారని, ఏడేళ్ల తర్వాత ఆ సంఖ్య రెట్టింపయ్యిందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర ఐటీ రంగం 6.28 లక్షలకుపైగా ఉద్యోగాలు కల్పిస్తున్నదని చెప్పారు. సుమారు 20 లక్షలకుపైగా మంది ఐటీ రంగంపై ఆధారపడి పనిచేస్తున్నారని కేటీఆర్ చెప్పారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను కేంద్రం ఆదుకోవాలని కోరారు. దీనికోసం రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement