సాంకేతిక సమస్య వల్ల ఈ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేదని శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తమ అభివృద్ధిని గవర్నర్ ప్రసంగం ద్వారా చెప్పాలని అనుకుంటాం..ఆ అవకాశాన్ని మేము పోగోట్టుకోం అని పేర్కొన్నారు. 1971, 2013లో గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు జరిగాయని గుర్తు చేశారు. సమావేశాలు ప్రోరోగ్ కాకపోతే గవర్నర్ ప్రసంగం ఉండదన్నారు. 2004 డిసెంబర్ లో పార్లమెంట్ లో రాష్ట్రపతి ప్రసంగం లేకుండానే బడ్జెట్ సెషన్ జరిగిందన్నారు. ప్రోరోగ్ సమావేశాలకు గవర్నర్ ను పిలిస్తే తప్పు.. అది రాజ్యంగంను అతిక్రమించినట్లు అవుతుందన్నారు. బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రారంభించాలని రాజ్యంగంలో ఎక్కడ లేదన్నారు. ప్రతి క్యాలెండర్ ఇయర్ లో జరిగే కొత్త సెషన్ ను మాత్రమే గవర్నర్ ప్రారంభిస్తారని తెలిపారు. ఇప్పుడు జరిగే బడ్జెట్ సమావేశాలు 8వ సెషన్ కు కొనసాగింపు అని చెప్పారు.
శాసనసభ వ్యవహారాలపై బీజేపీ నేతలకు అవగాహన లేదని విమర్శించారు. నిబంధనలు తెలుసుకోకుండా బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలోనే అత్యంత ప్రజాస్వామ్య బద్దంగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని చెప్పారు. అధికార పార్టీ తో సమానంగా ప్రతిపక్షాలకు మాట్లాడే సమయం ఇస్తున్నామని తెలిపారు. అభివృద్ధిలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని కేంద్ర గణాంకాలు చెపుతున్నాయని తెలిపారు. రాజ్యంగం గురించి బీజేపీ నేతలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇతర రాష్ట్రాలలో ప్రభుత్వాలను కూలగొట్టి గద్దెనెక్కిన చరిత్ర బీజేపీ ది అని విమర్శించారు. మోడీకి రాజ్యంగం అంటే లెక్కలేదన్నారు. రాజాసింగ్ స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ నీ కౌండౌన్ స్టార్టయ్యిందని హెచ్చరించారు. బీజేపీ నేతలను పిచ్చి ఆసుపత్రులో చేర్చుతామని వార్నింగ్ ఇచ్చారు.