Sunday, November 24, 2024

వైఎస్సార్‌ను విమ‌ర్శించ‌డం త‌ప్పా?: డీకే అరుణకు మంత్రి వేముల కౌంటర్

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలుపై మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఏపీ ప్రాజెక్టులు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిబంధనలు అతిక్రమించి నిర్మిస్తోందని ఆరోపించారు. రాయలసీమ ప్రాజెక్టు సాయంతో రోజుకు 7.7 టీఎంసీల నీటిని తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని, తద్వారా తెలంగాణ ప్రాజెక్టులకు నీరు అందని పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ, పాలమూరు, ఖమ్మం ప్రాంతాల రైతులు తీవ్ర ఇబ్బందుల పాలవుతారని చెప్పారు.

 ఏపీ ఆఖరికి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ)కు కూడా అవాస్తవాలు చెబుతోందని విమర్శించారు. రాయ‌లసీమ ఎత్తిపోత‌ల ప్రాజెక్టును ఆపాల‌ని కృష్ణా బోర్డు ఆదేశించిన విష‌యాన్ని గుర్తు చేశారు. కృష్ణా రివ‌ర్ మేనేజ్‌మెంట్ బోర్డు ఆదేశంతో రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల అక్ర‌మ‌మ‌ని తేలిపోయింద‌న్నారు. డీపీఆర్ లేకుండా ప్రాజెక్టు క‌ట్ట‌వ‌ద్ద‌ని బోర్డు స్ప‌ష్టంగా చెప్పింద‌న్నారు. కృష్ణా బోర్డు ఆదేశాల ప్ర‌కారం రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌నులు ఆపాల‌ని ఏపీ సీఎం జ‌గ‌న్‌ను డిమాండ్ చేస్తున్నామ‌ని మంత్రి వేముల పేర్కొన్నారు. రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల‌కు ఏపీ ప్ర‌భుత్వం జీవో ఇచ్చిన వారం రోజుల్లోనే తెలంగాణ ప్ర‌భుత్వం కృష్ణా బోర్డుకు లేఖ రాసిందని తెలిపారు. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి త‌ర్వాత కేంద్రానికి, కృష్ణా బోర్డుకు ఏడు లేఖ‌లు రాశామ‌ని వెల్లడించారు. రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల‌, ఆర్డీఎస్ కుడి కాల్వ ప‌నుల‌ను ఏపీ ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే ఆపాల‌ని మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శులు గుప్పించిన బీజేపీ నాయకురాలు డీకే అరుణకు మంత్రి వేముల కౌంటర్ ఇచ్చారు. రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల‌పై విపక్ష నాయ‌కులు మాట్లాడ‌టం దెయ్యాలు వేదాలు వ‌ల్లించిన‌ట్లుంద‌ని వేముల ప్ర‌శాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్సార్ రాయ‌ల‌సీమ‌కు నీళ్లు తీసుకుపోతుంటే నాటి కాంగ్రెస్ నాయ‌కురాలు డీకే అరుణ హార‌తి ప‌ట్టారని గుర్తు చేశారు. పోతిరెడ్డిపాడు కాలువ సామ‌ర్థ్యం 4 రెట్లు పెంచింది కాంగ్రెస్ హ‌యాంలో కాదా? అని నిలదీశారు. పోతిరెడ్డిపాడు విస్త‌ర‌ణ‌కు నిర‌స‌న‌గా కాంగ్రెస్ ప్ర‌భుత్వం నుంచి టీఆర్ఎస్ బ‌య‌ట‌కు వ‌చ్చింద‌న్నారు. ఏపీ అక్ర‌మ ప్రాజెక్టుల‌పై కాంగ్రెస్ ఎందుకు న్యాయ‌పోరాటం చేయ‌దు? అని ప్ర‌శ్నించారు. మ‌ల్ల‌న్న‌సాగ‌ర్‌పై కోర్టుల‌కు వెళ్లే కాంగ్రెస్ నాయ‌కులు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారు. తెలంగాణ బిడ్డ‌గా వైఎస్సార్‌ను విమ‌ర్శించ‌డం త‌ప్పా? అని మంత్రి వేముల ప్రశ్నించారు.

ఇదీ చదవండి: ఆర్డీఎస్ వద్ద కూర్చుంటాన్న కేసీఆర్ ఎక్కడకు పోయారు?

Advertisement

తాజా వార్తలు

Advertisement