తెలంగాణ మీద కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పచ్చబడితే వాళ్లు ఓర్వలేకపోతున్నారన్నారు. తెలంగాణలో పండిన వరి ధాన్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యపు ధోరణికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో రైతులు,నిరసన కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పెద్ద ఎత్తున రైతులతో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో పండిన వరి ధాన్యాన్ని పూర్తిగా కొనాల్సిందే అని ఈ సందర్భంగా రైతులు నినాదాలు చేశారు. వివిధ సందర్భాల్లో వరి వేయమని బిజెపి నాయకులు రైతులను రెచ్చగొట్టిన వీడియోలను మంత్రి వేముల నిరసన సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్ మీద ప్రదర్శించి చూపించారు. రైతులు,టిఆర్ఎస్ శ్రేణులు వీడియోలు ఆసక్తిగా చూసి, బీజేపీ నాయకులను వదిలే ప్రసక్తే లేదని నినాదాలు చేశారు. బీజేపీ నాయకుల ఇండ్ల ముందు ధాన్యం పారబోస్తానని శపధాలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ.. తెలంగాణ రైతుల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి నీళ్లు,24 గంటల ఉచిత కరెంట్,పెట్టుబడి సాయం,రైతు భీమా లాంటివి అందిస్తున్నారని అన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా బీజేపీవి అన్ని అబద్దాలే అని విమర్శించారు. కరెంట్ కోసం రూ.10 వేల కోట్లు,రైతు బంధు కోసం రూ.14 వేల కోట్లు, రైతు భీమా కోసం 3,700 కోట్లు ఏడాదికి ఖర్చు చేస్తున్నారని వివరించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కేసీఆర్ అమలు చేసే రైతు సంక్షేమ కార్యక్రమాలు లేవని అన్నారు. కేసీఆర్ వల్ల తెలంగాణలో సాగు విస్తీర్ణం, పంటల దిగుబడి పెరిగిందన్నారు. తెలంగాణ రైతులు ఆర్థికంగా బాగుపడాలని ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. రెండేళ్లుగా కేంద్రంలోని మోడీ బీజేపీ తెలంగాణలో పండిన ధాన్యాన్ని కొనేందుకు ఆటంకాలు సృష్టిస్తోందని మండిపడ్డారు.
తెలంగాణ ధాన్యాన్ని కొనాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ని మా మంత్రుల బృందం కలిస్తే.. వడ్లు కొనమని తెగేసి చెప్పారన్నారు. పైగా తెలంగాణ ప్రజలు నూకలు తినాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అవమానించేలా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మమ్మల్ని వంద అన్న పడతాం మా తెలంగాణ సమాజాన్ని అంటే అస్సలు ఊర్కోమన్నారు. ఇక్కడి బీజేపీ నాయకులు కేంద్రమంత్రికి వత్తాసు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ రైతులను రెచ్చగొట్టి వరి వేయించిన బండి సంజయ్,కిషన్ రెడ్డి ఎక్కడా..అని ప్రశ్నించారు. కేంద్రం మెడలు వంచైనా తెలంగాణ ధాన్యం కొనిపిస్తామని తెలిపారు. తెలంగాణ వడ్లు కొనే వరకు కేంద్రంలోని బీజేపీని,రాష్ట్ర బీజేపీ నాయకుల్ని ఎక్కడికక్కడ నిలదీస్తామని హెచ్చరించారు.