తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని విద్యా సంస్థలను మూసి వేస్తున్నట్లు ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే థియేటర్లను కూడా మూసివేస్తారని ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. సినిమా థియేటర్ల మూసివేత ఉండదని, యథావిధిగా నడుస్తాయని మంత్రి స్పష్టం చేశారు. అలాగే థియేటర్లలో సీట్ల ఆక్యుపెన్సీ విషయంలో కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఇప్పుడున్న కోవిడ్ నిబంధనల ప్రకారమే థియేటర్లు నడుస్తాయని తలసాని స్పష్టం చేశారు. సినిమా థియేటర్లను మళ్లీ మూసివేస్తే సినీ పరిశ్రమ భారీ నష్టాల్లోకి వెళుతుందని చెప్పారు.
కాగా, తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో థియేటర్లు మూసివేస్తారని పెద్ద జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ అంశమై ప్రభుత్వానికి వైద్య,ఆరోగ్య శాఖ ప్రతిపాదనలు పంపింది. థియేటర్లు పూర్తిస్థాయిలో మూసివేత సాధ్యం కాకుంటే కనీసం సగం సీట్లు మాత్రమే నింపేలా నిబంధనలు విధించాలని సూచించింది. తెలంగాణలో ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే చేయి దాటిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. వరుసగా కొత్త సినిమాలు విడుదలవుతుండటంతో థియేటర్లు 90 శాతంపైగా నిండిపోతున్నాయి. ప్రేక్షకులు మాస్కులు ధరించకుండా పక్క, పక్క సీట్లతో కూర్చోవడం వల్ల ప్రమాద తీవ్రత పెరుగుతోందని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది. దీంతో రాష్ట్రంలో థియేటర్లు మూసివేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. అంతేకాదు థియేటర్లలో మరోసారి 50 శాతం ఆక్యుపెన్సీకే పరిమితం కావలసి ఉంటుందని వార్తులు వినిపించాయి. ఈ నేపథ్యంలో దీనిపై మంత్రి క్లారిటీ ఇచ్చారు. థియేటర్లు నడుస్తాయని తలసాని స్పష్టం చేశారు.